ఏపీలోని టీడీపీ నేతలపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుపై ఆ పార్టీ శ్రేణులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
చంద్రబాబు అరెస్టులో కక్ష సాధింపు ఎక్కడుందని సజ్జల ప్రశ్నించారు.స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నేరం జరగలేదని నిరూపించగలరా అని నిలదీశారు.ఆధారాలతోనే చంద్రబాబు అరెస్ట్ అయ్యారన్న సజ్జల రూ.300 కోట్లు తిన్నారనడానికి ఆధారాలు ఉన్నాయని చెప్పారు.ఇది పెద్ద నేరం కాబట్టే చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసిందన్నారు.ఈ క్రమంలో కోర్టు నమ్మింది కాబట్టే జ్యుడీషియల్ రిమాండ్ విధించిందని పేర్కొన్నారు.చంద్రబాబుకు ఎవరి ద్వారా నిధులు చేరాయో ఆధారాలున్నాయన్న సజ్జల నిందితుల్లో ఇద్దరు విదేశాలకు పారిపోయారని మండిపడ్డారు.సాక్షులను దేశాలు దాటించగలరనే బాబును సీఐడీ అరెస్ట్ చేసిందని చెప్పారు.
ఈ కుంభకోణానికి చంద్రబాబే సూత్రధారి, పాత్రధారి, లబ్ధిదారి అని ఆరోపించారు.ఈ క్రమంలోనే చంద్రబాబు నిలువు దోపిడీ చేశారని రాష్ట్ర ప్రజలు నమ్ముతున్నారని తెలిపారు.







