2015 లో ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ దాని మీద ప్రతి రోజు ఎదో ఒక చర్చ జరుగుతూనే ఉంది.ఈ అంశాన్ని అనుకూలంగా వాడుకోవాలని టీడీపీ చూస్తుంటే ఇదే అంశంతో ఆ పార్టీని ఇరుకున పెట్టాలని వైసీపీ చూస్తోంది.
ఇలా ఎవరికి వారు రాజకీయం నడిపిస్తుండడంతో అమరావతి అంశం పరిష్కారం దొరకని సమస్యగా మారిపోయింది.రాజధానిగా అమరావతిని ప్రకటించగానే అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం భారీ ఎత్తున భూసమీకరణకు నడుం బిగించింది.
గతంలో 2013లో యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన భూసేకరణ చట్టాన్ని కాదని మరీ ల్యాండ్ పూలింగ్ పేరుతో సరికొత్త విధానాన్నిఅప్పటి ప్రభుత్వం తీసుకొచ్చింది.దీనిలో రాజధాని అభివృద్ధి కోసం భూములిచ్చిన రైతులకు కూడా న్యాయం చేస్తామని హామీ కూడా టీడీపీ ప్రభుత్వం ఇచ్చింది.
దానికి అనుగుణంగానే సీఆర్డీయే ఏర్పాటుతో పాటు 33 వేల ఎకరాల భూసమీకరణకు సిద్దపడింది.దానిపై అనేక వివాదాలు కూడా చోటు చేసుకున్నాయి.
కొంతమంది స్వచ్ఛందంగా తమ భూములు అప్పగిస్తే మరికొంతమంది దగ్గర ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కోవడం అప్పట్లో వివాదం సృష్టించింది.దీనిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అప్పటి ప్రతిపక్ష పార్టీగా ఉన్న వైసీపీ కూడా గట్టిగా ప్రయత్నించింది.

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినా అమరావతి విషయంలో ఏ క్లారిటీ లేకుండా పోయింది.అసలు వైసీపీ ప్రభుత్వం రాజధాని నిర్మాణంపై ఏ ఆలోచనతో ఉంది అనే విషయంలో ఎవరికీ క్లారిటీ లేదు.ఈ సందర్భంలోనే చంద్రబాబు రాజధాని పర్యటన వివాదాస్పదం అవుతోంది.అమరావతిలో అన్ని గ్రాఫిక్సే తప్ప బిల్డింగులు ఎక్కడా కట్టారంటూ వైసీపీ విమర్శలు చేస్తూ కొన్ని వీడియోలు బయటకి వదిలింది.
ఇదేనా రాజధాని అభివృద్ధి అని ప్రశ్నించింది.ఇదంతా రాజమౌళి గ్రాఫిక్స్ అంటూ వైసీపీ వెటకారం చేసింది.
అదే రేంజ్ లో టీడీపీ కూడా కొన్ని వీడియోలను బయటకి వదిలి ఇదిగో చంద్రబాబు కట్టిన బిల్డింగులు అంటూ చూపించింది.

అమరావతి అభివృద్ధి విషయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శల స్థాయి మాటల పరిధి దాటింది.వీడియోలతో విమర్శలకు దిగుతున్నారు.టీడీపీ ప్రభుత్వంలో రాజధాని అమరావతిలో అసలు నిర్మాణాలే జరగలేదన్నది వైసీపీ మొదట నుంచి చెబుతోంది.
కేవలం నాలుగు బిల్డింగులు కట్టి హాలీవుడ్ ఫిలిం మేకర్లు కూడా సృష్టించలేని గ్రాఫిక్స్ ను చంద్రబాబు సృష్టించారంటూ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చంద్రబాబును వెటకారం చేస్తూ వీడియోలు విడుదల చేశారు.

దీనిపై టీడీపీ గట్టిగా కౌంటర్ ఇస్తూ అమరావతిలో నిర్మాణాలు గ్రాఫిక్స్ కాదని, ఇవిగో సాక్ష్యాలు అంటూ రాజధాని నిర్మాణాలను ఆ వీడియోలో చూపించే ప్రయత్నం చేశారు.ఇక మంత్రి బొత్స రాజధానిని స్మశానంతో పోల్చిన విషయాన్ని కూడా టీడీపీ హైలెట్ చేసింది.దీనిపై బొత్స రాజధానిని శ్మశానంతో పోల్చటానికి కారణాలను వివరించారు.
పచ్చని పంట పొలాలను చంద్రబాబు రాజధాని పేరుతో నిరుపయోగంగా మార్చారని, దానివల్లే తాను శ్మశానంతో పోల్చానని వివరణ ఇచ్చారు.రాజధానిలో టీడీపీ ప్రభుత్వం గ్రాఫిక్స్ చూపించిందని, నాలుగు బిల్డింగులు కట్టారని అవి కూడా అసంపూర్తి నిర్మాణలేని చెప్పుకొచ్చారు బొత్స.
ఇక సోషల్ మీడియాలో అయితే వివిధ గ్రాఫిక్స్ లో రాజధాని పై రకరకాల వీడియోలు హల్చల్ చేస్తున్నాయి.ఇవిగో రాజమౌళి రాజధాని నిర్మాణాలు అంటూ సోషల్ మీడియాలో వీడియోలు చక్కెర్లు కొడుతున్నాయి.