రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో ఉన్న బీజేపీ దానికోసం ఎన్ని రకాల ఎత్తుగడలు వేయాలో, అన్ని రకాల ఎత్తుగడలు వేస్తూ, బలం పెంచుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తోంది.టిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసుకుంటూ, ఆ పార్టీని బలహీనం చేసే విషయంపై దృష్టి పెడుతూనే మరోవైపు, కాంగ్రెస్ లోని రాజకీయ ఉద్దండులను తమ పార్టీలో చేర్చుకుని బలం పెంచుకోవాలని చూస్తోంది.
దుబ్బాక ఉప ఎన్నికలతో పాటు, గ్రేటర్ లో వచ్చిన ఫలితాలతో మంచి జోష్ లో ఉన్న బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసింది.టిఆర్ఎస్ కాంగ్రెస్ లోని బలమైన నాయకులను చేర్చుకుని రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి విజయం దక్కే విధంగా ప్రయత్నాలు మొదలు పెట్టింది.
ముఖ్యంగా ఇటీవల నాగార్జునసాగర్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఆకస్మిక మరణంతో అక్కడ ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.ఆ ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ కూడా త్వరలోనే వెలువడనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే ఆ ఎన్నికలపై దృష్టి సారించింది.
దీనిలో భాగంగానే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని బీజేపీలోకి ఆహ్వానించినట్లు తెలుస్తోంది.ఆయన ను బీజేపీలోకి రప్పించేందుకు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ జానారెడ్డితో మంతనాలు చేసినట్లు తెలుస్తోంది.
అలాగే బీజేపీ పెద్దలు కూడా జానారెడ్డితో ఫోన్ లో మాట్లాడి పార్టీలోకి రావాలని ఆహ్వానించినట్లు సమాచారం.

ఈ సందర్భంగా జానారెడ్డికి నాగార్జునసాగర్ టికెట్ ఇచ్చేందుకు బీజేపీ నేతలు ఆఫర్ చేయగా, వయసు రీత్యా తాను యాక్టివ్ గా ఉండలేను అని, ఆ స్థానంలో తన కుమారుడికి టికెట్ ఇస్తే గెలిపించుకుంటాను అని చెప్పినట్లు తెలుస్తోంది.ఈ సందర్భంగా జానారెడ్డి కి గవర్నర్ పదవి ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.ఆయనకు ఇంతగా ప్రాధాన్యం ఇవ్వడానికి కారణం ఏంటి అంటే జానారెడ్డి కి నాగార్జునసాగర్ లో బలమైన నెట్వర్క్ ఉంది.
గతంలో ఆయన ఆ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు.అందుకే జానారెడ్డి కుటుంబానికే టికెట్ ఇస్తే, గెలుపు సులువుగా తమ ఖాతలో పడుతుందని బీజేపీ అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది.
అలాగే నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు తొమ్మిది సార్లు ఎన్నికలు జరగగా, ఏడుసార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు.అందుకే బీజేపీ ఇంతగా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది.