ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడుగా సోము వీర్రాజు నేడు బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ హాజరు అయ్యారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో భవిష్యత్తులో క్రియాశీలక పాత్ర పోషించబోతుందనే నమ్మకం వ్యక్తం చేశారు.ఇక ఏపీలో మూడు రాజధానుల విషయమై రాం మాధవ్ స్పందించారు.
ఆంధ్రప్రదేశ్ కంటే నాలుగు రెట్లు పెద్దది అయిన ఉత్తర ప్రదేశ్ కు కేవలం ఒకే ఒక్క రాజధాని ఉంది.అలాంటిది ఏపీకి ఎందుకు మూడు రాజధానులు అంటూ ప్రశ్నించాడు.
రాజధానుల విషయంలో కేంద్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయబోదు అంటూ క్లారిటీ ఇచ్చాడు.
గతంలో రాజధానిగా అమరావతిని ఏర్పాటు చేసి అక్రమాలకు అవినీతికి పాల్పడ్డ తెలుగు దేశం ప్రభుత్వంకు వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు చేసింది.
ఇప్పుడు వైకాపా ప్రభుత్వం కూడా రాజధాని పేరుతో అవినీతికి పాల్పడితే ఖచ్చితంగా ప్రశ్నిస్తామని ఈ విషయంలో ఎలాంటి అనుమానం లేదు అంటూ ఈ సందర్బంగా రాం మాధవ్ అన్నారు.మూడు రాజధానుల విషయంలో బీజేపీ స్పందన ఏంటీ అంటూ గత కొన్ని రోజులుగా తెలుగు దేశం పార్టీ ప్రశ్నిస్తున్న నేపథ్యంలో రామ్ మాధవ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.