అమెరికాలో భారతీయ విద్యార్ధుల వరుస మరణాలు కలవరపెడుతున్నాయి.దీంతో ఉన్నత చదువుల కోసం విదేశాలకు తమ పిల్లలను పంపాలనుకుంటున్న తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు.
ఇప్పటికే విదేశాల్లో వున్న తమ పిల్లల భద్రతపైనా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ స్పందించింది.
అధ్యక్షుడు జో బైడెన్, ఆయన పరిపాలనా యంత్రాంగం.భారతీయ విద్యార్ధులపై దాడులను అడ్డుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తున్నట్లు వైట్‌హౌస్( White House ) ఓ ప్రకటనలో తెలిపింది.
అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో భారతీయ , భారత సంతతి విద్యార్ధులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో వైట్‌హౌస్‌లోని జాతీయ భద్రతా మండలిలో వ్యూహాత్మక కమ్యూనికేషన్ సమన్వయకర్త జాన్ కిర్బీ( John Kirby ) ఈ ప్రకటన చేశారు.
గడిచిన కొన్ని వారాల్లో కనీసం నలుగురు భారతీయ విద్యార్ధులు మరణించిన సంగతి తెలిసిందే.సిక్కులతో సహా భారత సంతతి ప్రజలను దుండగులు లక్ష్యంగా చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.జాతి, లింగం, మతం లేదా ఇతర అంశాల ఆధారంగా హింసకు అమెరికా( America )లో తావు లేదని కిర్బీ మీడియాతో అన్నారు.
ఇలాంటి దాడులను అడ్డుకోవడానికి రాష్ట్ర, స్థానిక అధికారులతో కలిసి పనిచేస్తామని జాన్ కిర్బీ వెల్లడించారు.
మరోవైపు.భారతీయ కమ్యూనిటీకి చెందిన అజయ్ జైన్ భూటోరియా( Ajay Jain Bhutoria ) మాట్లాడుతూ.వేర్వేరు ఘటనల్లో విషాదకరమైన మరణాల పట్ల తాము తీవ్ర ఆందోళనకు గురైనట్లు చెప్పారు.
అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న వారి కోసం మెరుగైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని అజయ్ నొక్కి చెప్పారు.కళాశాల అధికారులు, స్థానిక పోలీసులు ఈ సవాళ్లను తక్షణమే పరిష్కరించాలని ఆయన సూచించారు.
ఈ ఘటనలు భారత్‌లోని విద్యార్ధుల తల్లిదండ్రులు, వారి కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తున్నాయని అజయ్ జైన్ ఆవేదన వ్యక్తం చేశారు.మెరుగైన భద్రతా చర్యలు , సహాయక వ్యవస్ధల కోసం ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ ఏకమవుతుందని ఆయన పేర్కొన్నారు.