కరోనా పీడ ఇంకా మానవాళిని వీడని సంగతి తెలిసిందే.అనేక దేశాల్లో కొత్త కొత్త వేరియంట్ల రూపంలో వైరస్ విరుచుకుపడుతోంది.
దీంతో బూస్టర్ డోస్‌ల పంపిణీ కార్యక్రమాన్ని పలు దేశాలు చేపట్టాయి.భారత్‌లోనూ 18 ఏళ్లు పై బడిన వారికి ఉచితంగా బూస్టర్ డోస్ వేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.సెకండ్ కోవిడ్ బూస్టర్ డోస్‌కు అర్హతను మరింత విస్తరించరాదని నిర్ణయించింది.
ఫైజర్, మోడెర్నాలు తమ ప్రస్తుత వ్యాక్సిన్‌లు ఒమిక్రాన్ వేరియంట్‌కు వ్యతిరేకంగా మెరుగైన పనితీరు కనబరుస్తాయని ప్రకటించడమే దీనికి కారణమని న్యూయార్క్ టైమ్స్ కథనాన్ని ప్రచురించింది.
జో బైడెన్ అధికార యంత్రాంగం సెప్టెంబర్‌లో బూస్టర్ షాట్‌ల కోసం కొత్తగా ప్రచారాన్ని ప్రారంభించాలని భావిస్తున్నట్లు పలువురు న్యూయార్క్ టైమ్స్‌తో అన్నట్లుగా తెలుస్తోంది.
ఫైజర్, మోడెర్నాలు రీటూల్ చేసిన మోతాదులను పంపిణీ చేస్తామని ప్రభుత్వానికి హామీ ఇచ్చాయని వారు అన్నట్లుగా కథనంలో తెలిపింది.కాగా.ఇప్పుడు అమెరికాలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.5కి వ్యతిరేకంగా ఈ కొత్త వెర్షన్‌లు ప్రభావవంతంగా వుంటాయని భావిస్తున్నారు.ప్రస్తుతం అమల్లోవున్న ఫెడరల్ మార్గదర్శకాల ప్రకారం.ఫైజర్ బయో ఎన్‌టెక్, మోడెర్నా షాట్‌ల నాల్గవ డోసును 50 ఏళ్లు పైబడిన వారికి , రోగ నిరోధక శక్తి లేని 12 ఏళ్లు పైబడిన వ్యక్తులకు పరిమితం చేశాయి.50 ఏళ్ల లోపు పెద్దలకు రెండవ బూస్టర్ సిఫార్సులను విస్తరించడం గురించి గత కొన్ని రోజులుగా మంతనాలు జరుగుతున్నాయని వైట్‌హౌస్ కరోనా వైరస్ కో ఆర్డినేటర్ ఆశిష్ ఝూ ఈ నెల ప్రారంభంలో తెలిపారు.ఈ విషయంలో ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) అధికారులదే తుది నిర్ణయమని ఆయన స్పష్టం చేశారు.
దేశంలో కోవిడ్ ఇన్ఫెక్షన్లు మళ్లీ పెరుగుతున్నందున వ్యాక్సిన్ పొందే అర్హతను మరింత విస్తరించాలని ఆశిష్ ఝూ, అగ్రశ్రేణి వ్యాధి నిపుణుడు డాక్టర్ ఆంథోనీ ఫౌసీ, మరికొందరు సీనియర్ ఆరోగ్య అధికారులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు.

అయితే వ్యాక్సిన్ పొందేందుకు అర్హతను విస్తరించడంలో ప్రధాన ఆందోళన ఏమిటంటే.కొందరు వ్యక్తులు చాలా తక్కువ వ్యవధిలో రెండు వేర్వేరు బూస్టర్ షాట్‌లను పొందుతారని దీని అర్థం.ఇప్పుడు ఆగస్ట్‌లో తర్వాత మళ్లీ సెప్టెంబర్‌లో కొత్తగా నవీకరించిన షాట్‌ను వెంట వెంటనే తీసుకోవడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముఖ్యంగా యువకులకు ఇది మయోకార్డిటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది.ఇది ఫైజర్, మోడెర్నా రెండింటి వ్యాక్సిన్‌లతో ముడిపడివున్న అరుదైన గుండె సంబంధిత దుష్ప్రభావం.







