క్రమ క్రమంగా తెలంగాణలో బిజెపి పట్టు పెరిగే విధంగా అనేక ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు చేపడుతూ వార్తల్లో ఉంటున్నారు తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్.ఇటీవలే ప్రజా సంకల్ప యాత్ర పేరుతో సంజయ్ తెలంగాణలో పాదయాత్ర నిర్వహించడం, ఆ ముగింపు సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరు కావడం వంటివి బీజేపీలో జోష్ నింపుతున్నాయి.
ఇక వరుసగా వినూత్నంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పై పోరాటం చేసే విధంగా సంజయ్ ప్లాన్ చేసుకుంటున్నారు.ఈమేరకు జూన్ మొదటి వారంలో మౌన దీక్ష చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
గ్రామ పంచాయతీల అభివృద్ధి కాకుండా ,రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోంది అని, దీనికి నిరసనగా ఈ దీక్ష చేపట్టబోతున్నట్లు సంజయ్ ప్రకటించారు.హైదరాబాద్ లంగర్ హౌస్ లోని బాపు ఘాట్ వేదికగా సర్పంచులతో కలిసి సంజయ్ నల్లబ్యాడ్జీలు ధరించి రెండు గంటల పాటు దీక్ష చేపట్టనున్నారు.
గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించకుండా తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థలను నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని, చేసిన పనులకు కూడా పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా సర్పంచులను మానసిక వేదనకు గురి చేస్తోందని అందుకే ఈ తీరుకు నిరసనగా టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఒత్తిడి పెంచేందుకు బిజెపి ఆధ్వర్యంలో దీనిపై నిరసన కార్యక్రమాలు చేపట్టే విధంగా సంజయ్ ప్లాన్ చేశారు. తెలంగాణ ప్రభుత్వ వైఖరి కారణంగా గ్రామపంచాయతీ వ్యవస్థ నిర్వీర్యం అయిందని, పల్లె ప్రగతి పేరుతో ఏం చెప్తున్నా.
సర్పంచులు చేస్తూ వచ్చారని, నాలుగు విడతలుగా ఈ కార్యక్రమం జరిగినా, వాటికి సంబంధించిన బిల్లులు ఇప్పటివరకు సర్పంచులకు అందించలేదన్నారు.

అన్ని బిల్లులు పెండింగ్ లో పెట్టడంతో అభివృద్ధికి నిధులు లేక గ్రామపంచాయతీలు దివాలా తీశాయి అని, కొన్ని గ్రామాల్లో సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తెలంగాణలో దాపురించిందని, ప్రభుత్వం చెప్పినట్టు అభివృద్ధి పనులను చేపట్టిన సర్పంచులు అంతా ఏళ్ల తరబడి బిల్లులు రాక అప్పుల పాలయ్యారని, వడ్డీ భారం పెరిగి మనోవేదనకు గురవుతున్నారని, అప్పుల భారం భరించలేక కొంత మంది ఆత్మహత్య లు కూడా చేసుకున్నారని , మరి కొంత మందికి ఈ పరిస్థితి రాకుండా బిజెపి తరపున పోరాటం చేయబోతున్నట్లు సంజయ్ ప్రకటించారు.







