తెలంగాణలో అధికార పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ను ఓడించి తెలంగాణలో బిజెపి జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ఆ పార్టీ రాష్ట్ర నాయకత్వంతో పాటు, బిజెపి అగ్ర నేతలు ఉన్నారు.అందుకే తరుచుగా వారంతా తెలంగాణలో పర్యటిస్తూ బిజెపి పట్టు పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో, వ్యూహాలు ప్రతి వ్యూహాల్లో మునిగితేలుతున్నారు.అంతేకాకుండా బీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ పార్టీగా ఉండడంతో, తెలంగాణలో కేసీఆర్ ను ఓడించడం ద్వారా జాతీయ రాజకీయాల్లో ఆయనకు పట్టు లేకుండా చేయాలనే పట్టుదల బిజెపి ఆగ్రనేతల్లో కనిపిస్తోంది.
అందుకే తెలంగాణ బిజెపి అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ కు పూర్తిగా సహకారం అందిస్తూ, ఆయనను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నారు.ఇక పదేపదే కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా , ప్రధాని నరేంద్ర మోది, కేంద్ర మంత్రులు ఇలా తరుచుగా ఏదో ఒక కార్యక్రమం పేరుతో తెలంగాణలో అడుగుపెడుతున్నారు.
పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు గ్రూపు రాజకీయాలు లేకుండా చేసేందుకు పూర్తిగా సంజయ్ కు స్వతంత్రం ఇచ్చారు.సొంత టీంను సంజయ్ ఏర్పాటు చేసుకున్నా, ఎటువంటి అభ్యంతరాన్ని వ్యక్తం చేయలేదు.
దీంతో వివిధ విభాగాలకు అధ్యక్షులు ,కార్యవర్గంతో పాటు, అనుబంధ సంఘాలు ఇలా అన్నిట్లోనూ సంజయ్ తను అనుకూల వ్యక్తులకు పెద్దపీట వేశారు అయితే ఇప్పుడు వారంతా సైలెంట్ గా ఉండిపోవడం, యాక్టివ్ గా కార్యకలాపాలు చేపట్టకపోవడం వంటివి సంజయ్ కు ఆందోళన కలిగిస్తోంది.

ఒకపక్క తాను బిఆర్ఎస్ ను టార్గెట్ చేసుకుని పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న, అనుబంధ సంఘాలు మౌనంగా ఉండడం వెనుక కారణం ఏమిటనేది సంజయ్ కు అంతు పట్టడం లేదు.తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అయినా బిజెపి కిషన్ మోర్చా ఎటువంటి ఆందోళన కార్యక్రమాలు, ఆ సమస్యల పైన పోరాడటం లేదు.

అలాగే ధరణి సమస్యల పైన గత నెల 27న కలెక్టరేట్ల ముట్టడికి బిజెపి పిలుపు ఇచ్చినా, కిసాన్ మోర్చా నేతలు హాజరు కాలేదు.ఇక మహిళా మోర్చా నేతలు సైతం పూజలతోనే సరిపెడుతున్నారు తప్ప , పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రయత్నాలు చేయడం లేదట.ఇక యువ మోర్చా నేతలు గత మూడు నెలలుగా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదట.అలాగే ఎస్సీ మోర్చా, ఓబీసీ మోర్చా, మైనారిటీ మోర్చ, ఎస్టీ మోర్చా లు కూడా ఇదేవిధంగా నిర్లక్ష్యంగా ఉన్నాయట.
ఇక పార్టీ అధికార ప్రతినిధుల వ్యవహారము దాదాపు ఇదేవిధంగా ఉందట.ఒక్కో అధికార ప్రతినిధి ఒక్కో అంశాన్ని ఎంచుకుని మీడియాతో మాట్లాడాలని సంజయ్ సూచించినా, వారు ఎవరు అంతగా ఆసక్తి చూపించడం లేదట.
అయితే జాతీయస్థాయిలో సంజయ్ కు ప్రాధాన్యం పెరుగుతుండడం, బిజెపి అగ్ర నేతలు ఆయనను ఎక్కువగా ప్రోత్సహిస్తు ఉండడం తదితర కారణాలతో బిజెపిలోని కొన్ని అదృశ్య శక్తులు ఈ అనుబంధ సంఘాలు యాక్టివ్ కాకుండా పనిచేస్తున్నాయనే అనుమానం ఇప్పుడిప్పుడే కలుగుతోంది.ఈ కమిటీలు ఇప్పుడు తనకే సహాయ నిరాకరణ చేస్తుండడం పై సంజయ్ ఆలోచనలో పడ్డారట.