టీడీపీ జాతి అధ్యక్షుడు చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా, దాని వెనుక ఎన్నో రాజకీయ కారణాలు ఉంటాయి.అషామాషి గా అయితే నిర్ణయాలు తీసుకుని బాబు అమలు చేయరు.
ప్రస్తుతం బాబు ఫోకస్ అంతా ఏపీ రాజకీయం పైనే ఉంది.ఏపీ లో టిడిపిని అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా బాబు ముందుకు వెళ్తున్నారు.
పార్టీ శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేస్తూ , ఎప్పటికప్పుడు వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు తగిన వ్యూహాలను రూపొందిస్తూ బిజీగా ఉంటున్నారు.దీంతో తెలంగాణలో టిడిపి పరిస్థితి అంతంత మాత్రమే అన్నట్టు గా తయారయింది.
వాస్తవంగా ఆంధ్ర, తెలంగాణ విభజన తరువాత టిడిపి కోలుకోవాలని విధంగా దెబ్బతింది. అక్కడ పార్టీ ఉన్నా.
పెద్దగా కార్యక్రమాలు ఏమి చేపట్టడం లేదు.ఇక 2023 ఎన్నికల్లోను టిడిపి ప్రభావం అంతంత మాత్రం గానే ఉండబోతుంది అనే విషయం అందరికీ తెలిసిందే.
అయినా చంద్రబాబు మాత్రం తెలంగాణలో టిడిపిని మరింత యాక్టివ్ చేసేందుకు, రాజకీయంగా తెలంగాణ టిడిపికి మరింత ప్రాధాన్యం పెరిగే విధంగా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.ఇప్పటికే పార్టీకి చెందిన కీలక నేతలు ఎంతోమంది టిడిపిలో రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఉద్దేశంతో టిఆర్ఎస్, బిజెపి వంటి పార్టీలలో చేరిపోయారు.
మొన్నటి వరకు తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా పనిచేసిన ఎల్ రమణ సైతం టిఆర్ఎస్ లో చేరిన వెంటనే ఎమ్మెల్సీగా పదవిని సంపాదించారు.పార్టీలో ఎవరికి పెద్దగా తెలియని బక్కాని నరసింహులు అనే వ్యక్తిని నియమించారు.

ఆయన నియామకం తర్వాత పార్టీ లో పెద్దగా ఆశించిన మార్పులేవి కనిపించలేదు.పూర్తిగా చంద్రబాబు కనుసన్నల్లో నే ఎవరైనా పని చేయాల్సి ఉండడం, తెలంగాణలో ఎంత ప్రయత్నించినా టీడీపీ ప్రభావం అంతంత మాత్రమే అన్నట్టుగా ఉంటుందనే విషయం బాబుకు బాగా తెలిసిన విషయం కావడంతో బక్కాని నరసింహులు ను టీ టిడిపి అధ్యక్షుడు గా అవకాశం కల్పించారు.తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన ప్రభావం ఏమాత్రం కనిపించలేదు.అయితే 2023 ఎన్నికల్లో టిడిపిని కీలకం చేసేందుకు, ప్రధాన పార్టీలను దెబ్బ కొట్టేందుకు సిద్ధమవుతున్న చంద్రబాబు బక్కాని నరసింహులు స్థానంలో కొత్తగా పార్టీలో చేరిన కాసాని జ్ఞానేశ్వర్ ను తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా నియమించారు.
ఆయన నియామకం చేపట్టడం వెనక కారణాలు చాలానే ఉన్నాయట.ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడంతోపాటు , బీసీ సామాజిక వర్గంలో కీలకంగా ఉండడం, అలాగే తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్న ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో జ్ఞానేశ్వర్ కు చంద్రబాబు తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా నియమించారు.
జ్ఞానేశ్వర్ నియామకంతో తెలంగాణలో టిడిపి మరింత యాక్టివ్ అవుతుందని, పార్టీ తరఫున కార్యక్రమాలు విస్తృతం అవుతాయని ఆర్థికంగా అన్ని జ్ఞానేశ్వర్ చూసుకుంటారు కాబట్టి, తనకు ఇబ్బంది ఉండదనే లెక్కల్లో బాబు ఈ నియామకం చేపట్టినట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.







