శాండల్ వుడ్ లో డ్రగ్స్ కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.ఈ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదురుకొంటున్న శాండల్ వుడ్ నటులు రాగిణి ద్వివేది,సంజన గల్రాని లను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
అయితే వీరి బెయిల్ పిటీషన్ పై విచారించిన కోర్టు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. రాగిణి ద్వివేది, సంజన గల్రానీలు పెట్టుకున్న బెయిలు దరఖాస్తుపై విచారణ గురువారానికి వాయిదా పడింది.
సిటీ సివిల్ కోర్టు ఆవరణలోని స్పెషల్ కోర్టులో వీరి బెయిలు పిటిషన్లు విచారణకు వచ్చాయి.రాగిణిని అరెస్ట్ చేసే సమయంలో పోలీసులు నిబందనలు పాటించలేదని, ఆమె ఇంట్లో సిగరెట్లు మాత్రమే దొరికాయని,డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఓ నిందితుడు చేసిన ఆరోపణల కారణంగానే ఎలాంటి నిబంధనలు పాటించకుండా అరెస్ట్ చేశారని కోర్టుకు తెలిపారు.
అలానే ఆమె తండ్రి మాజీ సైనిక అధికారని, కొవిడ్ సమయంలో పేదలు, వలస కార్మికులకు మద్దతుగా నిలిచారని, కాబట్టి బెయిలు ఇప్పించాలంటూ కోరారు.
అయితే సీబీఐ తరపు న్యాయవాదులు మాత్రం రాగిణి డ్రగ్స్ విక్రయించినట్టు తమ వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని కోర్టుకు తెలియజేశారు.
అంతేకాకుండా ఆమె నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్ పాస్‌వర్డ్ కూడా ఇంతవరకు చెప్పలేదని, వైద్య పరీక్షలకు సైతం ఆమె సహకరించలేదని సీబీఐ వెల్లడించింది.అలానే ఈ కేసుకు సంబంధించి మరో ఇద్దరు నిందితులు పరారీ లో ఉన్నారని , ఇప్పుడు ఈమెకు జామీను ఇస్తే తదుపరి విచారణ కష్టం అవుతుంది అని కోర్టుకు వివరించింది.
ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఆమెకు 20 ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉందని, కాబ్టటి ఆమెకు బెయిల్ ఇస్తే తప్పించుకునే అవకాశాలు కూడా లేకపోలేదని సీబీఐ పేర్కొంది.అయితే సీబీఐ వాదనలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం వారిద్దరి బెయిల్ పిటీషన్ ను గురువారానికి వాయిదా వేసినట్లు తెలుస్తుంది.
ఒకపక్క బాలీవుడ్ లో కూడా డ్రగ్స్ మాఫియా వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి పలువురు నటులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
వారందరికీ కూడా త్వరలో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు కూడా అందే అవకాశం కనిపిస్తుంది.ఇప్పటికే బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్స్ శ్రద్దాకపూర్, దీపిక లకు విచారణకు హాజరుకావాలి అంటూ నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
మరి ఈ డ్రగ్స్ కేసులో ఇంకెంతమంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు బయటపడతాయో చూడాలి.