ప్రస్తుతం కాంగ్రెసు పార్టీ ఎటువంటి దయనీయ స్థితిలో అందరికీ తెలుసు.తెలంగాణ అసెంబ్లీలో ప్రభుత్వంపై విరుచుకుపడటానికి కొందరు ఎమ్మెల్యేలైనా ఉన్నారు.
కాని ఆంధ్ర చట్ట సభలో ఒక్క సభ్యుడూ లేడు.దీంతో కాంగ్రెసు నాయకులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది.
వారు ఓటమి నుంచి ఇంకా పూర్తిగా తేరుకోకపోయినా, నిరాశ నుంచి బయటపడకపోయినా కాలూ చేయీ ఆడించనిదే ప్రయోజనం లేదు.కేవలం మాటలతో ప్రభుత్వాన్ని విమర్శించడం కాకుండా కొంత కార్యాచరణ కూడా ఉండాలి.
అంటే కాంగ్రెసు నాయకులు, కార్యకర్తలు వీధుల్లోకొచ్చి ఉద్యమించాల్సిన అవసరం ఉంది.చట్ట సభలో స్థానంలేకపోయినా ప్రజల తరపున పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని తెలియచెప్పాల్సిన అవసరముంది.
దీనిపైనే నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు.బుర్రలకు పని చెబుతున్నారు.
కాంగ్రెసు పార్టీ ఉద్యమాలు చేయకపోతే పిసిసి అధ్యక్షుడు రఘువీరా రెడ్డి పదవికి ముప్పు వచ్చే అవకాశముంది.తెలంగాణలో పొన్నాలను పీకేసి ఉత్తమ్ కుమార్‌కు బాధ్యతలు అప్పగించిన సోనియా గాంధీ ఆంధ్రలో మాత్రం వేచిచూసే ధోరణితో ఉన్నారు.
రాష్ర్ట, కేంద్ర ప్రభుత్వాలపై పోరాటాలు చేయకపోతే ఆమె పదవి పీకుతారనే భయం పీసీసీ అధ్యక్షుడు రఘువీరాకు ఉంది కాబట్టి ఏక కాలంలో టీడీపీ, ఎన్‌డిఏ ప్రభుత్వాలపై పోరాటం చేయాలని పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ నిర్ణయించింది.ప్రధానంగా విభజన చట్టంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేదాకా పోరాటం చేయాలని కాంగ్రెసు ప్లాన్ చేస్తోంది.
మరి ఈ పోరాటంలో ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి.