ఏపీ టిడిపి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత టిడిపి టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు కొద్దిరోజుల పాటు సైలెంట్ గానే ఉన్నారు.చంద్రబాబు ఇటీవల నియమించిన రాష్ట్ర పార్టీ కమిటీలలో తన మార్క్ ఏమీ లేకుండా, మొత్తం చంద్రబాబు తనకు కావాల్సిన వారందరిని నియమించుకున్నారు అని, దీంతో అచ్చెన్న కాస్త అలక చెందారు అని ప్రచారం జరిగింది.
అయితే మళ్లీ ఇప్పుడు అచ్చెన్న పూర్తిగా యాక్టివ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.వైసీపీ ప్రభుత్వం పై పోరాడేందుకు ముందుగా తన సొంత నియోజకవర్గం నుంచి ఉద్యమం మొదలుపెట్టినట్లు గా కనిపిస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఆ పార్టీ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్న చోట్ల ఇన్చార్జిల ను నియమించింది.పూర్తిగా ఇన్చార్జిల ద్వారానే అన్ని వ్యవహారాలను చక్కబెట్టి, అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు.
అయితే చాలా చోట్ల ఎమ్మెల్యే ను పిలవకుండానే, ఈ తంతు నిర్వహించడం వంటి వ్యవహారాలతో ప్రోటోకాల్ సమస్యలు ఏర్పడుతున్నాయి.ఈ వ్యవహారాలపై చాలామంది టిడిపి ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసిన స్పందన అంతంత మాత్రంగానే ఉంది.
అయితే ఇటీవల అచ్చన్న కు సైతం తన సొంత నియోజకవర్గంలో ఇటువంటి సంఘటనలు ఎదురవడం, అక్కడ వైసీపీ ఇన్చార్జిగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ మొత్తం వ్యవహారాలను చక్కబెడుతూ ఉండడం పై అచ్చన్న ఫైర్ అవుతున్నారు.

అంతేకాకుండా ఇటీవల నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేపట్టారు.ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే గా ఉన్న తనకు ఆహ్వానం అందించకుండా పూర్తి చేయడంపై అచ్చెన్న ఫైర్ అవ్వడమే కాకుండా, అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.దీంతో అసెంబ్లీ కార్యదర్శి జిల్లా కలెక్టర్ విచారణ చేయవలసిందిగా ఆదేశించడం , జిల్లా కలెక్టర్ నియోజకవర్గంలోని నాలుగు మండలాల ఎంపీడీఓలకు ఈ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని కోరడం వంటి సంఘటనలు జరిగాయి.
దీంతో అధికారుల పరిస్థితి సంకటంగా మారింది.ఇదిలా ఉంటే రాష్ట్ర మంతా ఇదే రకంగా ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతూ, టిడిపి ప్రజాప్రతినిధులను చిన్న చూపు చూస్తున్నారు అనే అంశంపై ఫిర్యాదు చేయడంతో పాటు, ప్రజల్లోకి తీసుకు వెళ్లి వైసీపీ ప్రభుత్వం హవాను తగ్గించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
అంతే కాకుండా, మరికొన్ని ప్రజాసమస్యలను తెరపైకి తీసుకువచ్చి ఇరుకున పెట్టే విధంగా ప్లాన్ చేసుకుంటున్నట్లు గా కనిపిస్తున్నారు.