ఏపీ సీఎం జగన్ అధ్యక్షతన ఏర్పాటైన కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.ఈ భేటీలో భాగంగా పలు బిల్లులకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
సీఎం మరియు ఆయన కుటుంబ సభ్యుల భద్రత కోసం స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరుతో తీసుకురానున్న కొత్త పథకానికి ఆమోదం లభించింది.
కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ ముసాయిదా బిల్లు, ఏపీ వైద్యవిధాన పరిషత్ సవరణ బిల్లు, ప్రైవేట్ యూనివర్సిటీల చట్టంలో సవరణ బిల్లు, అసైన్డ్ భూముల క్రమబద్దీకరణ, పీఓటీ చట్ట సవరణకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.
అదేవిధంగా దేవాదాయ చట్ట సవరణ బిల్లుకు ఆమోదం తెలిపిన ఏపీ కేబినెట్ ప్రభుత్వ ఉద్యోగులకు వరాలు జల్లు కురిపించింది.
ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ సమయానికి సొంత ఇంటి స్థలం ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ ఆదేశించారు.రిటైర్డ్ ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంట్, రిటైర్డ్ ఉద్యోగుల కుటుంబాలకు ఆరోగ్య శ్రీ వర్తించేలా చర్యలు తీసుకోనున్నారు.
దాంతో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు జీపీఎస్ అమలు బిల్లుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.అదేవిధంగా కాకినాడ -తుని మధ్యలో ఏర్పాటు చేయనున్న బల్క్ డ్రగ్ పార్కును అనకాపల్లి జిల్లా నక్కపల్లి వద్ద ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.








