ఏపీలో అధికార వైసీపీలో అంతర్గత విబేధాలు ఇప్పుడిప్పుడే భగ్గుమంటున్నాయి.టీడీపీలో గెలిచి వైసీపీ చెంత చేరిన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో పాత వర్సెస్ కొత్త ఎమ్మెల్యే మధ్య ఏ మాత్రం పొసగడం లేదు.
గన్నవరంలో ఎమ్మెల్యే వంశీ, చీరాలలో కరణం బలరాం, గుంటూరు పశ్చిమంలో ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్ రావు ఇప్పుడు ఇదే సమస్య ఎదుర్కొంటున్నారు.ఇక విశాఖ దక్షిణంలో టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్లిన వాసుపల్లి గణేష్ కుమార్ తీసుకున్న ఓ నిర్ణయం వైసీపీలో చిచ్చుకు కారణమైంది.
వాసుపల్లి గణేష్ గత యేడాది వైజాగ్ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్లు ముగిశాక వైసీపీ చెంత చేరారు.
అయితే అప్పటికే దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ ఇన్ చార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్ తన వర్గీయులకు వైసీపీ తరపున కార్పొరేటర్ టిక్కెట్లు ఇప్పించుకున్నారు.
అయితే ఆయన మృతి చెందడంతో ఇప్పుడు వాసుపల్లి ఇక్కడ పూర్తి హవా చెలాయిస్తున్నారు.ఇప్పుడు ద్రోణంరాజు టిక్కెట్లు ఇచ్చిన వారిలో కొందరిని కాదని ఎమ్మెల్యే వాసుపల్లి తనకు అనుకూలంగా ఉన్న వాళ్లకు బీ ఫామ్‌లు ఇస్తున్నారు.
ఇది పార్టీలో తీవ్ర అసమ్మతికి కారణమైంది.గతంలో 36వ వార్డు కార్పొరేటర్‌గా స్వర్ణలతకు బీ ఫామ్ ఇవ్వగా ఇప్పుడు ఆమెను తప్పించేశారు.

ఆమె తనకు బీ ఫామ్ ఇవ్వకపోవడంతో ధర్నాకు దిగారు.పలు దళిత సంఘాలు సైతం స్వర్ణలతకు బీ ఫామ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఎమ్మెల్యే వాసుపల్లి తమకు అన్యాయం చేశారని స్వర్ణలత వర్గం ఆవేదన వ్యక్తం చేస్తోంది.స్వర్ణలత భర్త కొప్పుల వెంకటరావు మాట్లాడుతూ తాము ముందు నుంచి వైసీపీని నమ్ముకుని ఉన్నామని.
పార్టీకి తమ సేవలను గుర్తించే ద్రోణంరాజు తమకు సీటు కేటాయించారని.ఇప్పుడు ఎమ్మెల్యే వాసుపల్లి తమను పక్కన పెడుతున్నారంటూ వారు ఆరోపిస్తున్నారు.3వ తేదీ లోగా తమకు బీ ఫామ్‌లు ఇవ్వకపోతే రెబల్స్‌గా పోటీలో ఉంటామని వారు వార్నింగ్ ఇస్తున్నారు.