మనం ఉపయోగించే యాప్‌లలో ఒక్కోసారి డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు వంటివి వస్తుంటాయి.ఓ పది రూపాయలు మనకు కలిసి వచ్చినా ఎంతో సంతోషంగా ఫీల్ అవుతాం.అయితే ఒక్కోసారి భారీ డిస్కౌంట్‌లు వస్తుంటాయి.50 శాతం వరకు డిస్కౌంట్లు లభిస్తాయి.అంతకు మించి క్లియరెన్స్ సేల్ అంటూ కొన్ని సార్లు మరింత భారీగా ఆఫర్లు వస్తుంటాయి.అలాంటి సందర్భాల్లో ఉబ్బితబ్బిబ్బవుతుంటాం.
అయితే ఓ యాప్ తన కస్టమర్లకు కళ్లు చెదిరే ఆఫర్ ఇచ్చింది.ఒక్క రూపాయి చెల్లించకుండానే ఖరీదైన ఆహారం, మద్యం ఫ్రీ అంటూ ప్రకటించింది.
దీంతో చాలా మంది కస్టమర్లు అప్రమత్తమయ్యారు.తమకు తోచినంత ఫుడ్, మద్యం ఆర్డర్లు పెట్టేశారు.
అక్కడే అసలు ట్విస్ట్ ఎదురైంది.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
అమెరికాలో డోర్ డాష్ అనే ప్రముఖ యాప్ ఉంది.ఇందులో ఫుడ్, మద్యం మనం ఆర్డర్లు పెట్టుకోవచ్చు.ఇటీవల యాప్ ఓపెన్ చేసిన కస్టమర్లు ఆశ్చర్యపోయారు.కావాల్సిన ఫుడ్, మద్యం ధర చూస్తే ఏమీ లేదు.
అంటే ఏదైనా ఆర్డర్ పెట్టుకున్నా డబ్బులు చెల్లించాల్సిన పని లేదు.ఇంకేముంది.
ఈ వార్త ఆనోటా ఈ నోటా అందరికీ పాకిపోయింది.కాసేపటికే వెల్లువలా ఆర్డర్లు వచ్చిపడ్డాయి.
లక్షల సంఖ్యలో ఆర్డర్లు పెట్టేశారు.ఉచితంగా వచ్చే ఖరీదైన ఫుడ్, అంత కంటే ముఖ్యంగా మద్యం ఎవరు మాత్రం వదులుకుంటారు.
అయితే వెల్లువలా వచ్చి పడుతున్న ఆర్డర్లను చూసి యాప్ ప్రతినిధులు అవాక్కయ్యారు.అసలు సంగతేంటని చూడగా వారికి విషయం అర్ధం అయింది.
కేవలం సాంకేతిక లోపం వల్లే వస్తువుల ధరలు లేవని, అందువల్ల అవన్నీ ఉచితంగా భావించి కస్టమర్లు ఆర్డర్లు పెట్టేశారని యాప్ గుర్తించింది.వెంటనే ఆ ఆర్డర్లను చెల్లనవిగా ప్రకటించింది.
దీంతో ఫ్రీగా ఫుడ్, మందు వస్తుందని భావించిన కస్టమర్లంతా ఉస్సూరు మంటూ నిరాశకు గురయ్యారు.