మనిషి జీవించడానికి డబ్బు అవసరం.కానీ మనిషి డబ్బు సాధించడం కోసమే జీవిస్తున్నాడు.కష్టపడి సంపాదించడానికి సమాజంలో ఎన్నో మార్గాలు ఉన్నాయి.కానీ కొందరు వ్యక్తులు డబ్బు కోసం ఎటువంటి మోసాలు, దారుణాలు చేయడానికైన సిద్ధపడుతున్నారు.అడ్డదారిలో డబ్బు సంపాదించడం కోసం చిన్న పిల్లలు తినే తినుబండారాలను కల్తీ చేయడం, ఎక్స్ పైర్ డేట్ అయిపోయిన వాటికి స్టిక్కర్లు తీసేసి, కొత్త స్టిక్కర్లు వేసి మార్కెట్లో అమ్ముతున్నారు.దీనితో ఏది తినాలో, ఏది తినకూడదో, ఏది మంచి వస్తువు, ఏది మంచి వస్తువు కాదో తెలియడం లేదు.
రాచకొండ ఎస్వోటి పోలీసులకు నకిలీ చాక్లెట్ల దందా పై సమాచారం అందడంతో, ముఠా గోదాములపై దాడి చేశారు.హైదరాబాద్ లోని బోడుప్పల్ లో రీసైక్లింగ్ పేరుతో ఎక్స్ పైర్ డేట్ అయిపోయిన వస్తువుల తేదీలపై కొత్త స్టిక్కర్స్ వేసి సబ్బులు, షాంపులు, తినుబండారాలను మార్కెట్లోకి వదులుతున్నారు.

ఇందులో ఎక్కువ భాగం చిన్న పిల్లలు తినే బిస్కెట్లు, చాక్లెట్లు, చిప్స్ ప్యాకెట్స్ ఉన్నాయి.సమాచారం అందడంతో బోడుప్పల్, కోఠి లోని ఆరిహంత్ కార్పొరేషన్ కార్యాలయ గోదాములలో అధికారులు సోదాలు చేస్తే, సుమారు కోటి విలువ చేసే 300 రకాల వస్తువులను ముఠా రీసైక్లింగ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు.

అంబాలా జైన్, కమల్ జైన్ అనే నిందితులు ఎక్స్ పైర్ డేట్ అయిపోయిన వస్తువులపై 2024-25 వరకు ఎక్స్ పైర్ తేదీలు వేసి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు తెలిపారు.ఈ ఘరానా మోసం బయటపడడంతో ఏది తినాలో, ఏది తినకూడదదో తెలియని పరిస్థితి.దీనిపై కేసు నమోదు చేసి, అన్ని కోణాల్లో లోతుగా పోలీసులు విచారణ చేస్తున్నారు.







