తెలంగాణలో కాంగ్రెస్( Telangana congress ) గెలిచే అవకాశం లేదనే నివేదికలతో ఆ పార్టీ అధిష్టానం అలర్ట్ అవుతోంది.అయితే సీనియర్ నాయకులు ఎవరికి వారే తామే గొప్ప అన్నట్లుగా వ్యవహరిస్తూ, పార్టీ విజయం కంటే తమ ప్రాధాన్యం పెంచుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.
సీనియర్ నాయకులు కేవలం తాము పోటీ చేసే నియోజకవర్గం మినహా, మిగతా నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉండడం తదితర వ్యవహారాలపై పూర్తిగా దృష్టి సారించిన కాంగ్రెస్ అధిష్టానం పెద్దలు ఈ మేరకు తెలంగాణలో ఏఐసిసి బృందాలను రంగంలోకి దించింది. కాంగ్రెస్ అభ్యర్థులతో సంబంధం లేకుండా రహస్యంగా పార్టీ కార్యక్రమాలను, ప్రచార తీరు తెన్నులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అధిష్టానానికి సమాచారాన్ని చేరవేస్తున్నారట.
ఆ సమాచారంతో వాస్తవ పరిస్థితులను అంచనా వేసి, ఎప్పటికప్పుడు కాంగ్రెస్ అగ్ర నేతలు నియోజకవర్గ అభ్యర్థులకు, పార్టీ కీలక నాయకులు సమాచారం పంపిస్తున్నారట.
దీంతోపాటు అభ్యర్థులకు సంబంధం లేకుండానే ఆయా నియోజకవర్గాల్లో పార్టీ కార్యక్రమాలను విస్తృతం చేసే విధంగా ఏఐసిసి బృందాలు ప్రయత్నాలు చేస్తున్నాయట. ముఖ్యంగా పోల్ మేనేజ్మెంట్ ను బలోపేతం చేసే విధంగా ప్రత్యేక వార్ రూమ్ బృందాలు దాదాపు 80 నియోజకవర్గాల పై ప్రత్యేక ఫోకస్ పెట్టాయట. ఇంటింటికి ఆరు గ్యారెంటీలు, పోలింగ్ బూత్ స్థాయికి సంబంధించిన సమాచారం, అధికార పార్టీ బీఆర్ఎస్ , బిజెపిల( BRS , BJP )ను ఎదుర్కొనేందుకు అవసరమైన వ్యూహాలను ఎప్పటికప్పుడు అమలు చేస్తున్నారట.
ఏఐసిసి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వార్ రూమ్ లో నియోజకవర్గాల వారిగా ప్రచారం, బూత్ స్థాయి కార్యకర్తలకు శిక్షణ ఇవ్వడం , ఇంటింటికి కాంగ్రెస్ హామీలు చేరేటట్టు చేయడం వంటి అంశాలను పర్యవేక్షిస్తుందట. దీనిలో భాగంగానే ఒక్కో నియోజకవర్గానికి 20,000 లెక్కన ఆరు గ్యారెంటీ కార్డులను 119 నియోజకవర్గాలకు పంపిణీ చేపట్టారట.
ఈ గ్యారెంటీ కార్డులు బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఇంటింటికి అందిస్తున్నారా లేదా అనే దాని పైన కూడా ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారట.
నియోజకవర్గంలోని అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో తీరిక లేకుండా ఉండడంతో , జరగాల్సిన అన్ని కార్యక్రమాలను చేపట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం చర్యలు చేపట్టింది.ఇప్పటివరకు 60కి పైగా నియోజకవర్గాల్లో బూత్ కార్యకర్తలకు శిక్షణ కూడా ఇచ్చారట.మిగిలిన నియోజకవర్గాలకు చెందిన వారికి శిక్షణ కార్యక్రమాలను వీలైనంత త్వరగా పూర్తి చేసి రాబోయే ఎన్నికల్లో తిరుగు లేకుండా చేసుకునే పనిలో నిమగ్నం అయ్యారట.