కరోనా కారణంగా స్కూళ్లు మూతపడ్డాయి.మార్చి నుంచి విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు.
అన్లాక్ తరువాత ఆన్లైన్ క్లాసులు ప్రారంభమైనప్పటికీ వాటికి అంతగా రెస్పాన్స్ రావడంలేదు.అకాడమిక్ ఇయర్ ముగుస్తున్నా ఇంకా విద్యాసంస్థలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో ఓ క్లారిటీలేదు.
పాఠశాలలు, కాలేజీలు, వర్సిటీలు ఎప్పుడు తెరుచుకుంటాయో కొంతకాలంగా స్పష్టత కరువైంది.ఈ నేపథ్యంలో విద్యాసంస్థలు పునఃప్రారంభంపై సీఎం కీలక సమావేశం ఏర్పాటు చేయడం ఆసక్తిగా మారింది.
విద్యార్థులు అకాడమిక్ ఇయర్ కోల్పోకుండా ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోనుంది.ఈనెల 11న ఉదయం విద్యావ్యవస్థపై సమీక్ష జరపనున్నారు.స్కూళ్లు ఎప్పటి నుంచి ప్రారంభించాలి? కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా ఎలాంటి జాగ్రత్తులు తీసుకోవాలి? తరగతుల నిర్వహణలో ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలపై కూలంకషంగా మంత్రులతో, అధికారులతో సీఎం చర్చించనున్నారు.ఈ సమావేశంలో విద్యాసంస్థల ప్రారంభం విషయంలో ముఖ్యమంత్రి కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

సంక్రాంతి తరువాతనే విద్యాసంస్థలు తెరుచుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈనెల 18 నుంచి పాఠశాలలు, కాలేజీలు తెరుచుకుంటాయని తెలుస్తోంది. 9వ తరగతి నుంచి ఆ పై తరగతులకు క్లాసులు ప్రారంభం అయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
కరోనా వైరస్ ఇంకా మన రాష్ట్రంలో పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు.
ఒకరోజు తక్కువ, మరో రోజు ఎక్కువగా కేసులు నమోదవుతునే ఉన్నాయి.అదీ కాకుండా కరోనా స్ట్రెయిన్ వ్యాప్తి కూడా జరుగుతున్న తరుణంలో విద్యాసంస్థల్లో తరగతుల నిర్వహణ ఏ విధంగా చేపట్టాలనేది కీలకంగా మారనుంది.
అందుకు విద్యాసంస్థలు ఎంతవరకు ముందుకు వచ్చి కరోనా వ్యాప్తి నివారణ చర్యలు చేపడతారనేది చూడాల్సి ఉంది.అలాగే విద్యార్థుల తల్లి దండ్రులు కూడా వారి వారి పిల్లలను పాఠశాలలకు పంపించడానికి అంతగా సుముఖత చూపడంలేదు.