ఈ ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాలను తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకి తరలివచ్చే అవకాశం ఉందని, గరుడసేవ నాడు 5 నుంచి 6 లక్షలు మంది భక్తులు వాహనసేవను చూసేందుకు వస్తారని సమాచారం ఉన్న నేపథ్యంలో భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అనంతపురం డిఐజి రవిప్రకాష్ తెలిపారు.ఈ నెల 27వ తేదీ నుంచి శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఉత్సవాలు ఏర్పాట్లపై టీటీడీ అధికారులు,విజిలెన్స్,పోలీసు అధికారులతో కలిసి మాడ విధుల్లో ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.మాడ వీధుల్లో కేవలం 1.9 లక్షలు మంది భక్తులు మాత్రమే ఉత్సవాలను వీక్షించే అవకాశం ఉందని, రెండేళ్లు అనంతరం ఉత్సవాలను మాడ వీధుల్లో నిర్వహిస్తా ఉండడంతో ఈ సారి అంతకంటే భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ఉత్సవాలు తిలకించేందుకు వచ్చే భక్తులు కచ్చితంగా పోలీసుల సూచనలను పాటించాలన్నారు.తీవ్రవాదుల కదలికల ఉన్న నేపథ్యంలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.







