లింగ వివక్ష, సమానత్వం అంటూ కోర్టుకు ఎక్కి, దేవాలయాల్లో దశాబ్దాలుగా అమలవుతున్న పద్ధతులు తొలగించేలా చేసిన మహిళా సంఘాలు ఇప్పుడు కొత్త వివాదాన్ని తెరపైకి తెచ్చాయి.పలు ప్రముఖ ఆలయాల్లో మహిళలు సంప్రదాయ చీరలనే ధరించి ప్రవేశించాలన్న నిబంధనలు ఉండగా, ఇది వివక్షతే నంటూ ఇటీవలి కాలంలో అనూహ్యంగా తెరపైకి వచ్చిన భూమాతా బ్రిగేడ్ నాయకురాలు తృప్తీ దేశాయ్ ఆరోపించారు.
వేసుకునే దుస్తులపై నిబంధనలేంటని ప్రశ్నించిన ఆమె, చీర స్థానంలో ప్యాంటు, కోటు వేసుకుని కొల్హాపూర్ లోని మహాలక్ష్మి దేవాలయంలోకి వెళ్లేందుకు ప్రవేశించగా, పోలీసులు అడ్డుకున్నారు.
దేవాలయ నిబంధనల ప్రకారం చీరతోనే మహిళలు లోపలికి వెళ్లాల్సి వుంటుందని చెప్పగా, ఆమె మండిపడ్డారు.
ఇష్టమొచ్చిన దుస్తులను ధరించనీయకుండా అడ్డుపడతారా? అని మండిపడ్డారు.కాగా, పలు దేవాలయాల్లో వస్త్ర నిబంధనలు అమలవుతున్న సంగతి తెలిసిందే.
తమిళనాడు, కర్ణాటక లోని పలు దేవాలయాలు పురుషులు షర్ట్ లేకుండా వస్తేనే అనుమతిస్తుండగా, కేరళలో చాలా ఆలయాలు కేవలం పంచెతో మాత్రమే వెళితేనే అనుమతిస్తారన్న సంగతి తెలిసిందే.
ఇక మహిళల విషయానికి వస్తే, ప్రముఖ దేవాలయాలెన్నో జీన్స్, టీషర్ట్, మినీస్, షార్ట్స్ ధరించి వస్తే, ఆలయాల్లోకి అనుమతించడం లేదు.
తిరుమలలో సైతం మహిళలు చీర లేదా పంజాబీ డ్రస్, చుడీదార్ మాత్రమే ధరించాల్సి వుంటుంది.తాజాగా తృప్తీ దేశాయ్ అరెస్టుతో మరో సరికొత్త వివాదం తెరపైకి వచ్చినట్లయింది.







