తెలుగమ్మాయి అంజలి తమిళంలో హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుని ఆ తర్వాత తెలుగులో ‘షాపింగ్ మాల్’, ‘జర్నీ’ వంటి డబ్బింగ్ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఆ రెండు సినిమాలు అంజలికి మంచి గుర్తింపు తీసుకు రావడంతో ఈ అమ్మడికి వరుసగా తెలుగులో ఆఫర్లు వస్తున్నాయి.
ఇప్పటికే పలు చిత్రాల్లో నటించిన ఈ అమ్మడు తాజాగా బాలకృష్ణ సరసన ‘డిక్టేటర్’ వంటి భారీ చిత్రంలో నటించింది.మరో వైపు ‘చిత్రాంగధ’ అనే హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రంలో నటించింది.
ఇలా వరుసగా తెలుగు చిత్రాల్లో నటిస్తున్న అంజలి అతిథి పాత్రల్లో నటించేందుకు కూడా ఓకే చెబుతోంది.
తాజాగా నిఖిల్ హీరోగా, నందిత హీరోయిన్‌గా ఉదయ్ నందనవనం దర్శకత్వంలో కోన వెంకట్ నిర్మించిన ‘శంకరాభరణం’ చిత్రంలో అంజలి ఒక చిన్న గెస్ట్ రోల్‌లో నటించిన విషయం తెల్సిందే.
ఆ సినిమాలో అంజలి పాత్రకు మంచి పేరు రావడంతో మంచు విష్ణు సైతం తన సినిమాలో అంజలిని గెస్ట్ రోల్ చేయిస్తున్నాడు.ప్రస్తుతం విష్ణు నటిస్తున్న ‘సరదా’ చిత్రంలో అంజలిని చిన్న పాత్రకు ఎంపిక చేయడం జరిగింది.
ఈ సినిమా కోసం అంజలి 10 రోజుల డేట్లు కేటాయించింది.అందుకు గాను ఏకంగా 50 లక్షల పారితోషికాన్ని అందుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.
అంటే రోజుకు 5 లక్షల పారితోషికాన్ని ఈ అమ్మడు అందుకుంటున్నట్లు.ఈ స్థాయి పారితోషికం ఆ సినిమాలో మెయిన్ హీరోయిన్‌గా నటిస్తున్న ‘జాదూగాడు’ ఫేం సొనారికకు సైతం ఇవ్వడం లేదు అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
అంజలికి ఉన్న క్రేజ్ దృష్ట్య ఈ సినిమాలో ఎంపిక చేసినట్లుగా నిర్మాత చెబుతున్నాడు.







