ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెసుకు రెండుసార్లు అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడు, మంత్రిగా పనిచేసిన నేత, రాష్ర్ట కాంగ్రెసులో కీలక పాత్ర పోషించిన లీడర్, నిజామాబాద్‌కు చెందిన తిరుగులేని ‘భారీ’ మనిషి ధర్మపురి శ్రీనివాస్ అలియాస్ డీఎస్ అధికారికంగా ‘గులాబీ’ కండువా కప్పుకున్నారు.టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డీఎస్‌ను, ఆయన అనుచరులను సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.
దీంతో రాజకీయ శుత్రువు మిత్రుడైపోయాడు.విమర్శించిన నోటితోనే భజన చేయడానికి డీఎస్ సిద్ధమయ్యారు.‘డీఎస్ టీఆర్‌ఎస్‌లో చేరి నా పక్కన నిల్చున్నందుకు నేను ఆయనకు శాల్యూట్ చేస్తున్నాను’…అని కేసీఆర్ అన్నారు.డీఎస్‌తో తనకు గత ముప్పయ్‌ఐదేళ్లుగా మంచి సంబంధాలు ఉన్నాయని, ఆయన సలహాలు, సూచనలతో ముందుకు పోతానని సీఎం చెప్పారు.నాలుగు దశాబ్దాల కాంగ్రెసును వదిలి, ఎన్నో పదవులు ఇచ్చి ఆదరించిన పార్టీని తోసిరాజని మంత్రి పదవి కోసమో, ఎమ్మెల్సీ పదవి కోసమో డీఎస్ టీఆర్‌ఎస్‌లో చేరారు.‘బంగారు తెలంగాణ సాధించడానికే టీఆర్‌ఎస్‌లో చేరా’ అని ఆయన అన్నమాట నిజమని భ్రమపడితే అంతకుమించిన అమాయకత్వం మరొకటి ఉండదు.ఇప్పుడు డీఎస్‌కు శాల్యూట్ చేస్తున్నానని చెప్పిన కేసీఆర్ భవిష్యత్తులో అదే పని చేస్తారా? ఆయన సలహాలు తీసుకుంటారా? చెప్పలేం.ఇప్పుడు అక్కున చేర్చుకున్న గులాబీ దళాధిపతి రేపు తీసి పక్కకు పెడతాడని కాంగ్రెసు చెబుతున్నారు.
డీఎస్ మళ్లీ ఏనాటికైనా తమ గూటికే చేరతాడని ఆశగా ఉన్నారు.చూద్దాం ఏమవుతుందో….!







