విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలు సాగుతున్నాయి.విద్యార్థి సంంఘాలు ప్రతి రోజూ ధర్నాలు, రాస్తారోకోలు, ముట్టడులు…మొదలైన ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నాయి.ఎందుకు? కార్పొరేట్, ప్రయివేటు పాఠశాలల్లో, కళాశాలల్లో ఫీజులు నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నాయి.ఈ ఆందోళనలు ప్రతి ఏటా జరుగుతూనే ఉన్నా, ఈసారి ఇంకా ఉధృతంగా సాగుతున్నాయి.
ప్రయివేటు, కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులు విపరీతంగా పెరిగాయి.ఎల్‌కేజీకే వేల రూపాయలు వసూలు చేస్తున్నారు.
కార్పొరేట్ విద్యా సంస్థలు పిండుకుంటున్నాయి.దీంతో విద్యార్థులు ఆందోళనలు తీవ్రం చేశారు.
ఇప్పుడు ఈ ఆందోళనలోకి ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు కూడా ప్రవేశించారు.యూనివర్సిటీలో వివిధ విద్యార్థి సంఘాలకు చెందిన విద్యార్థులు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఎదుట కూడా ధర్నా చేశారు.
విద్యాహక్కు చట్టం అమలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.ప్రభుత్వ పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు.
ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద ఆందోళన చేసినవారిలో పదిహేను మందిని పోలీసులు అరెస్టు చేశారు.విద్యార్థులు ఎన్ని ఆందోళనలు చేసినా పరిస్థితి మారుతుందని చెప్పలేం.
సర్కారు ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వ బడులను, కళాశాలలను నిర్వీర్యం చేసి కార్పొరేటుకు, ప్రయివేటుకు ప్రోత్సాహం ఇస్తోంది.ఇంజినీరింగ్, మెడికల్ కళాశాలల నుంచి ప్రాథమిక పాఠశాలల వరకు బడా రాజకీయ నాయకుల చేతుల్లో ఉన్నాయి.
వారే ప్ర జాప్రతినిధులు అవుతున్నారు.మంత్రులుగా కొలువు దీరతున్నారు.
ఈ నేపథ్యంలో వారి విద్యా సంస్థల్లో ఫీజులు నియంత్రించడం సాధ్యం కాదని చెప్పొచ్చు.ఆ ఫీజులు నియంత్రించడం చేతకాకనే ఫీజు రీయింబర్సుమెంటు వంటి పథకాలు పెట్టారు.
ఉన్న ప్రభుత్వ పాఠశాలలనే మూసేయాలని ప్రయత్నిస్తున్న సర్కారు ఫీజులు నియంత్రించదు.నాణ్యమైన విద్య అందించదు.







