ఇప్పటి డిజిటల్ యుగంలో, సోషల్ మీడియా ద్వారా క్షణాల్లో వార్తలు ప్రపంచమంతటా వ్యాపిస్తాయి.ముఖ్యంగా విపరీతమైన ఘటనలు, ఆశ్చర్యకరమైన దృశ్యాలు మరింత వేగంగా వైరల్ అవుతాయి.
కొన్నిసార్లు ఇవి ఆసక్తికరమైన కథనాలుగా మారితే, మరికొన్ని సంఘటనలు విమర్శలకు దారితీస్తాయి.ఇటీవలి మధ్యప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో( Madhya Pradesh Global Investor Summit ) జరిగిన ఒక ఘటన ఇందుకు మంచి ఉదాహరణ.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఫిబ్రవరి 24, 25 తేదీల్లో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ ఘనంగా నిర్వహించబడింది.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ( Narendra Modi )ప్రారంభించిన ఈ సదస్సుకు దేశవిదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పెట్టుబడిదారులు హాజరయ్యారు.
భారీ పెట్టుబడులు, మౌలిక వసతులపై కీలక ఒప్పందాలు జరిగాయి.అయితే, ఈ గొప్ప సమ్మిట్‌లో ఊహించని విధంగా భోజనానికి సంబంధించి వివాదాస్పద ఘటన చోటుచేసుకుంది.

సదస్సులో హై క్లాస్ డ్రెస్‌లో వచ్చిన బిజినెస్ మ్యాన్‌లు, పెట్టుబడిదారులు అన్నం కోసం పోటీపడి మరీ ప్లేట్లు గుంజుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.మహిళలు, పురుషులు తినే తిండి కోసం తోసుకుంటూ వెళ్లడమే కాకుండా.భోజన ప్లేట్ల కోసం కోలాహలం సృష్టించారు.దీంతో కొన్ని ప్లేట్లు నేలరాలిపోయి విరిగిపోయాయి.ఈ దృశ్యాలను ఎవరో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యాయి.ఒక ప్రపంచ స్థాయి సదస్సులో ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.
లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు జరిగే వేదికలో కనీసం భోజన ఏర్పాట్లు సమర్థవంతంగా చేయలేకపోయారా? అంటూ నెటిజన్లు ప్రభుత్వాన్ని, నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు.

ఈ వివాదాస్పద ఘటన జరిగినప్పటికీ, మధ్యప్రదేశ్ ప్రభుత్వం గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించిందని చెబుతోంది.ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ప్రకారం, ఈ సదస్సులో రూ.26.61 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి.దీని ద్వారా 17.3 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని చెప్పారు.ఈ ఘటనతో భవిష్యత్తులో ఇటువంటి సమ్మిట్‌లలో ఏర్పాట్లను మరింత జాగ్రత్తగా నిర్వహించాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతోంది.
సోషల్ మీడియా సమయానికి స్పష్టమైన దృశ్యాలను అందించగలిగే సాధనమైందని, అధికారిక నిర్వాహకులు ప్రతి చిన్న విషయాన్ని గమనించి ముందస్తు చర్యలు తీసుకోవాలని నెటిజన్లు సూచిస్తున్నారు.







