నల్లగొండ జిల్లా:పదవి విరమణ పొందిన తర్వాత కూడా ఉపాధ్యాయ ఉద్యమంతో పాటు పౌరుడిగా సామాజిక సమస్యల పట్ల స్పందించి పనిచేస్తున్న ఉద్యమకారుడు గోపాల్ రెడ్డి పన్నాల గెలుపుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర రోడ్లు,భవనాలు మరియు సినిమాటోగ్రఫి శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.ఆదివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో నల్లగొండ, వరంగల్,ఖమ్మం జిల్లా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గోపాల్ రెడ్డి పన్నాల ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి తనకు మద్దతు ఇవ్వవలసిందిగా కోరగా మంత్రి పై విధంగా స్పందించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ నాకు తెలిసినప్పటి నుండి గోపాల్ రెడ్డి ఆయన పని చేసిన ప్రతి పాఠశాలను అంకితభావంతో అభివృద్ధి చేసిన ఉత్తమ గెజిటెడ్ ప్రధాన ఉపాధ్యాయులని, ఏపిటిఎఫ్ నల్గొండ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఉపాధ్యాయుల సమస్యలు నా దృష్టికి తీసుకువచ్చి పరిష్కారం చేసుకున్నారని గుర్తు చేశారు.అందుకే ఆయనకు సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నానని తెలిపారు.
మంత్రి తనకు మద్దతు తెలిపినందుకు గోపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా జేఏసీ చైర్మన్ డాక్టర్ తోట నరసింహచారి,విద్యార్థి జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధీరావత్ వీర నాయక్,కృష్ణారెడ్డి,బోధనం నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.







