తాజాగా ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ ఎథిక్స్ ఎడిటర్ డాక్టర్ సిల్వియా కర్పాగం( Dr Sylvia Karpagam, Editor of the Indian Journal of Medical Ethics ) చేసిన ఒక కామెంట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపింది.పాల ఉత్పత్తులైన పాలు, పన్నీర్ వెజిటేరియన్ ఎలా అవుతాయని ఆమె ప్రశ్నించారు.
అసలు ఈ ప్రశ్న ఎందుకు తలెత్తిందంటే, డాక్టర్ సునీత సాయమ్మగర్ ( Dr.Sunitha Sayammagar )అనే మరో డాక్టర్, మామూలు వెజిటేరియన్ భోజనం ఎంత పోషకమో చూపిస్తూ ఒక ఫొటో పెట్టారు.ఆ ఫొటోలో కీరదోస, క్యారెట్, ఉల్లిపాయలతో పాటు పన్నీర్, కొబ్బరి, పప్పు ఉన్నాయి.

ఇది చూసి డాక్టర్ కర్పాగం “ఇదేం వెజిటేరియన్ భోజనం? పన్నీర్, పాలు వెజిటేరియన్ కాదు కదా.” అని ట్వీట్ చేశారు.అంతే, సోషల్ మీడియా యూజర్లు పెద్ద చర్చ మొదలెట్టేశారు.డాక్టర్ కర్పాగం చెప్పిన దాంట్లో నిజం ఉందని కొందరు అన్నారు.“పాలు, పన్నీర్ జంతువుల నుంచి వస్తాయి కదా, అవి ఎలా వెజిటేరియన్ అవుతాయి?” అని వాదించారు.కానీ చాలామంది మాత్రం దీన్ని ఒప్పుకోలేదు.“పాలు, పన్నీర్ కోసం జంతువులను చంపట్లేదు కదా, అవి వెజిటేరియనే” అని తమదైన శైలిలో వాదించారు.

ఒక యూజర్ అయితే “పాలు, పన్నీర్ జంతువుల నుంచి వస్తాయి నిజమే కానీ వాటి కోసం జంతువులను చంపరు కదా.అందుకే అవి వెజిటేరియన్.వెజిటేరియన్ కాదు అంటే అది వేగన్ అవుతుంది.పాల సేకరణలో ఏమైనా బాధ ఉండొచ్చు కానీ తినడం వల్ల కాదు కదా” అని కామెంట్ చేశారు.దీంతో డాక్టర్ కర్పాగం మరింత హాట్ టాపిక్ లేవనెత్తారు.“అయితే గుడ్లు ఎందుకు వెజిటేరియన్ కాదు?” అని ఎదురు ప్రశ్న వేశారు.ఇంకేముంది.ఈ చర్చ ఇంకా పెద్దదైపోయింది.సోషల్ మీడియాలో ఎవరికి తోచినట్టు వాళ్లు వాదిస్తున్నారు.పాలు, పన్నీర్ వెజిటేరియనా? కాదా? తేల్చేది ఎప్పుడు మరి? అనేది ప్రశ్నార్థకంగా మారింది.







