నల్లగొండ జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాల పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని, ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ వీటిపై దృష్టి సారించి,గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులకు అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం సరంపేట గ్రామంలోని క్రీడా ప్రాంగణం దేనికి పనికి స్థలంగా మారిందని,కేవలం బోర్డు ఏర్పాటు చేసి చేతులు దులుపుకున్నారని స్థానిక యువకులు ఆరోపిస్తున్నారు.
క్రీడా ప్రాంగణం ఇలా ఉంటే ఇందులో ఆటలు ఎలా ఆడాలని ప్రశ్నిస్తున్నారు.మా గ్రామం మాత్రమే కాదని, మండల వ్యాప్తంగా చాలా గ్రామాలలో క్రీడా ప్రాంగణాలు ఇలానే ఉన్నాయని అంటున్నారు.
ప్రతి గ్రామంలో పిల్లలకు చదువుతోపాటు క్రీడలపై ఆసక్తి పెంపొందించడానికి యువత తాము ఎంచుకున్న క్రీడల్లో శిక్షణ పొందడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది.
అప్పటి వరకు గ్రామాలలో క్రీడా మైదానాలు లేక ప్రైవేట్ స్థలాలు,పాఠశాలలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న స్థలాల్లో ఆడుకునే యువతి, యువకులు క్రీడాప్రాంగణాలలో ఆడుకోవచ్చని సంబుర పడ్డారని,క్రీడ ప్రాంగణాల బోర్డును చూసి త్వరలో క్రీడ సామాగ్రి,పరికరాలు వస్తాయని క్రీడాకారులు ఆశించారని,కానీ, క్రీడా ప్రాంగణాల్లో పరికరాల ఊసే లేదని,కేవలం క్రీడా ప్రాంగణాలని ఉట్టి బోర్డులు పెట్టి వెళ్లిపోయారని వాపోతున్నారు.
ఇప్పుడు అందులో పిచ్చి మొక్కలతో దర్శనమిస్తున్నాయని,యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారిలోని క్రీడా నైపుణ్యాలు వెలికి తీయాలనే గత ప్రభుత్వం లక్ష్యం ఉన్నంతగా ఉన్నా క్షేత్రస్థాయిలో అధికారులు,
నాటి ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యంతో ప్రభుత్వలక్ష్యం నీరుగారిపోయిందని,క్రీడా ప్రాంగణం చుట్టూ నాటే మొక్కలను రెండు సంవత్సరాల పాటు సంరక్షించేందుకు ఓ వాచ్మెన్ ను నియమిస్తానని చెప్పారని, కానీ,ఆ ప్రభుత్వంలో చెప్పిన ఏ ఒక్క అంశం అందుబాటులో లేకపోవడం,ఎక్కడా సామాగ్రి ఏర్పాటు చేసిన దాఖలాలు కనిపించడం లేదన్నారు.దీంతో లక్షలు వెచ్చించి నెలకొల్పిన క్రీడా ప్రాంగణాలు అలంకార ప్రాయంగానే మిగిలిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కొత్త సర్కార్ అయినా పట్టించుకోని సౌకర్యాలు కల్పించి తెలంగాణ రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో గ్రామీణ క్రీడా ప్రాంగణాలు అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటున్నారు.