బహుజన రాజ్యాధికార పితామహుడు కాన్షీరామ్

కాన్షీరామ్( Kanshi Ram ) అనే పేరు ఈ దేశ మూలవాసులైన ఎస్సీ, ఎస్టీ,బీసీ మరియు మైనారిటీలు అయినటువంటి బహుజనుల ఆత్మ గౌరవ ప్రతీక.మాన్య శ్రీ కాన్షీరామ్ 1934 మార్చి 15వ తారీఖున పంజాబ్ రాష్ట్రంలోని రోపర్ జిల్లాలో ఖావాసపూర్ గ్రామంలో సిక్కు రామదాసియా చమార్ కులంలో శ్రీ తేల్ సింగ్, శ్రీమతి బిషన్ కౌర్ పుణ్య దంపతులకు జన్మించాడు.

 Kanshiram Was The Father Of Bahujan Rajyadhikar ,bhimrao Ramji Ambedkar ,kans-TeluguStop.com

అనేక సంవత్సరాలుగా మానవ హక్కులకు దూరంగా ఉంచబడిన పీడిత జనులను విముక్తి చేయడానికి డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్( Bhimrao Ramji Ambedkar ) తన జీవితం చివరి వరకు కృషి చేస్తే,ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని మరణించే వరకు అందుకోసం పోరాడిన గొప్ప యోధుడు కాన్షీరామ్.పీడిత జనులను పాలకులుగా చూడాలనుకున్న అంబేడ్కర్ కలలను నిజం చేసినవాడు కాన్షీరామ్.1959లో పుణెలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిలటరీ ఎక్స్‌ప్లోజివ్స్ సంస్థలో పరిశోధన అధికారిగా నియమితులయ్యారు.ఒక రామదాసియా చమార్ కులంలో పుట్టి సైంటిస్ట్‌గా ఎదిగి తన లక్ష్యాన్ని నిర్దేశించుకున్న అసమాన వ్యక్తి కాన్షీరామ్.అంబేడ్కర్ గురించి తీవ్రంగా ఆలోచించడం ప్రారంభించిన ఆయన అంబేడ్కర్ సామాజిక, రాజకీయ జీవితాన్ని లోతుగా అధ్యయనం చేశారు.”కుల నిర్మూలన” పుస్తకం కాన్షీరామ్‌ను తీవ్రంగా ప్రభావితం చేసింది.1963లో సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిలిటరీ ఎక్స్‌ప్లోజివ్స్‌లో పని చేస్తున్న కాలంలో దీనాబానా అనే నాల్గవ తరగతి ఉద్యోగిని బర్తరఫ్ చేయడాన్ని కాన్షీరామ్ తీవ్రంగా ప్రతిఘటించి ఆందోళన ప్రారంభించారు.ఆయన చేసిన చట్టబద్ధ పోరాటం వల్ల ఆమెను తిరిగి ఉద్యోగంలోకి తీసుకోడం జరిగింది.

అదే విధంగా ఒక దళిత స్త్రీని ఉద్యోగంలోకి తీసుకోకుండా వివక్ష చూపుతుంటే ఆయన ఉద్యోగంలోకి చేర్చడానికి పోరాటం జరిపారు.ఈ రెండు ఘటనలు కాన్షీరామ్‌లో పోరాటం స్ఫూర్తి నింపాయి.

తమ జాతి జనులకు ఏదో చేయాలనే తపన ఆయనలో పెరిగింది.

అంబేడ్కర్ నడిపిన ఉద్యమాలను, గ్రంథాలను శోధించడం,పరిశీలించడం ప్రారంభించిన కాన్షీరామ్ అంబేడ్కర్‌తో పాటు మహాత్మా జ్యోతిరావు ఫూలే,ఛత్రపతి సాహు మహారాజ్,నారాయణ గురు,పెరియార్ రామస్వామి వంటి నాయకుల పోరాటాలను అధ్యయనం చేశారు.

పీడిత ప్రజలు కులాలుగా, ఉపకులాలుగా విడిపోయి ఉండటంవల్ల రాజ్యాధికారానికి దూరం గా ఉన్నారని,ఈ చిన్నచిన్న సమూహాలను బహుజన సమూహంగా మారిస్తే అధికారం చేజిక్కించుకోడం సాధ్యమవుతుందని గ్రహించిన కాన్షీరాం దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని,ప్రజలను చైతన్యవంతం గావించాలనే దృఢ సంకల్పానికి వచ్చారు.కుల ప్రాతిపదికన అస్తవ్యస్తంగా ఉన్న సమాజాన్ని మార్చడానికి,నిజాయితీతో కూడిన సమరశీల శక్తిగా ఎదగడానికి బ్రహ్మచర్యం పాటించాలని కఠిన నిర్ణయం తీసుకున్నారు.

కాన్షీరామ్‌కి పెళ్లి చేయాలని కుటుంబం నిర్ణయిస్తే బహుజన సమాజమే తన కుటుంబమని,అంబేడ్కర్ చేపట్టిన మహోన్నత సామాజిక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం తన జీవిత లక్ష్యమని,తాను చనిపోయినట్లు తన కుటుంబ సభ్యులందరూ భావించాలని 1965లో తల్లిదండ్రులకు ఉత్తరం రాశారు.దళితుల విముక్తే లక్ష్యంగా ఒక భుజాన సంచితో,పాత సైకిల్‌తో కాళ్లకు చెప్పులు లేకుండా ఊరూరా కరపత్రాలు పంచుతూ ఆకలి, దాహం మరచిపోయి అనేక ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు.

విద్యార్థులను, ఉద్యోగులను పోగేసి సమావేశాలు ఏర్పాటు చేసి అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని వారితో పంచుకునేవారు.కాన్షీరామ్ ఆలోచనా విధానం నచ్చిన ఉద్యోగులు ఆయన వెంట నడవడానికి సిద్ధపడ్డారు.

బోధించు! సమీకరించు!!పోరాడు!!! అనే నినాదంతో 1978,డిసెంబర్ 6న ‘బామ్ సెఫ్’( Back Word And Minority Community Employees Federation )ను స్థాపించాడు.ఎస్‌సి,ఎస్‌టి, ఒబిసి,మైనారిటీ ఉద్యోగులను ఏకం చేసి దోపిడీకి గురవుతున్న తమ జాతి ప్రజల రుణం తీర్చుకోవడమే ధ్యేయంగా BAMCEF ఏర్పడింది.

‘పే బ్యాక్ టు సొసైటీ’ అనే నినాదంతో సమాజానికి విద్యావంతులైన ఉద్యోగులు తమ మేధస్సు( ప్రతిభ )ను డబ్బును,సమయంను (talent, treasury, time )అందించాలని కాన్షీరామ్ కోరారు.కాన్షీరామ్ కోరిక మేరకు ఎంతో మంది ఉద్యోగులు ‘బామ్ సెఫ్’ కార్యక్రమాలలో పాల్గొని సమాజ అభివృద్ధికి కృషి చేశారు.1981 డిసెంబర్ 6న ప్రజలను పోరాటం వైపు నడపడానికి డిఎస్‌ఎస్‌ఎస్ఎస్ DS4( దళిత్ సోషిత్ సమాజ్ సంఘర్షణ సమితి)ను స్థాపించారు.ఇందులో పెద్ద ఎత్తున విద్యార్థులు,యువత చేరారు.

రాజ్యాధికారం కోసం కృషి చేయండి అని అంబేడ్కర్ చెప్పిన మాటలు గుర్తు చేస్తూ యువతను చైతన్య పరుస్తూ కశ్మీరు నుండి కన్యాకుమారి వరకు సమానత్వం కోసం సైకిల్ ర్యాలీ నిర్వహించి బాబా సాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధకుడిగా చరిత్రలో నిలిచారు.‘మన టిక్కెట్లు మనమే ఇచ్చుకుందాం మన ఓటు మనమే వేసుకుందాం’అనే ఉద్దేశంతో 1982లో హర్యానా,ఢిల్లీ, పంజాబ్,జమ్మూకశ్మీర్ ఎన్నికలలో దళిత్ సోషిత్ సమాజ్ సంఘర్షణ సమితి పాల్గొని పోటీ చేసిన పార్టీలలో నాలుగవ స్థానాన్ని సాధించింది.

ఎన్నికలలో బహుజనులు పూర్తిగా మద్దతు తెలిపారు.బహుజనులకు ఒక రాజకీయ పార్టీ అవసరాన్ని తెలుపుతూ ప్రచారం చేశారు.1984 ఏప్రిల్ 14న అంబేడ్కర్ జయంతి నాడు లక్షలాది ప్రజల ముందు కాన్షీరామ్ పార్టీ పేరు బహుజన సమాజ్ పార్టీ( బీఎస్పీ),ఎన్నికల గుర్తు ఏనుగును ప్రకటించారు.ఫూలే ఉద్యమం నుండి బహుజన సమాజ్ పేరును,అంబేడ్కర్ ఉద్యమం నుండి నీలి జెండా, ఏనుగు గుర్తును తీసుకున్నట్లు ప్రకటించారు.1984 నుండి జరిగిన ఎన్నికలలో బిఎస్‌పి తన అభ్యర్థులను నిలబెడుతూ జాతీయ పార్టీలకు గట్టి పోటీని ఇస్తూ ముందుకు సాగింది.1989లో బిఎస్‌పి ఉత్తరప్రదేశ్‌లో రెండు లోక్‌సభ,13 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకుంది.1993 ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో బిఎస్‌పి,ఎస్‌పి సంకీర్ణ కూటమి విజయం సాధించి ములాయం సింగ్ ప్రభుత్వంలో బిఎస్‌పి సభ్యులు మంత్రులుగా ఉండడం దేశ ప్రజలను ఆశ్చర్యంలోకి నెట్టడమే కాక మనువాద బ్రాహ్మణీయ శక్తులకు కంటి మీద కునుకు లేకుండా చేసింది.బహుజన సమాజ్ పార్టీని జాతీయ పార్టీగా తీర్చిదిద్దడంలో కాన్షీరామ్ నిరంతరం శ్రమించి విజయం సాధించారు.

ఇతర రాజకీయ పార్టీల మద్దతుతో మాయావతి ముఖ్యమంత్రిని చేశారు.దేశంలోని అతిపెద్ద రాష్ట్రానికి మాయావతిని ముఖ్యమంత్రి చేయడం మామూలు విషయం కాదు.

కాన్షీరామ్‌కే అది చెల్లింది.వేల సంవత్సరాల నుండి పాతుకుపోయిన కుల వ్యవస్థను అగ్రకులాల నాయకత్వంలో నడిచే వర్గ పోరాటాలు కుల వ్యవస్థను నాశనం చేయలేకపోగా పోరాటాలలో పాల్గొంటున్న బహుజన వర్గాలైనటువంటి ఎస్సీ,ఎస్టి,బిసి,మైనార్టీల శక్తియుక్తులు,ఉద్వేగాలు నిర్వీర్యం అవుతున్నాయని గ్రహించిన కాన్షిరాం వాటిని బహుజన రాజకీయ, రాజ్యాధికార ఉద్యమానికి ఉపయోగించుటలో సఫలీకృతుడు అయ్యాడని చెప్పాలి.

ఈ దేశంలో కుల వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడపడానికి పునాదులు వేసిన గౌతమ బుద్ధుడు నుండి మొదలుకొని మహాత్మ జ్యోతిరావు పూలే, చత్రపతి సాహు మహారాజ్, నారాయణ గురు,పెరియార్ రామస్వామి నాయకర్,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ల నుండి స్ఫూర్తి పొంది, “రాజ్యాధికారమే సకల సమస్యలకు పరిష్కారం” అని గ్రహించిన కాన్షిరాం బహుజనులకు రాజ్యాధికారాన్ని రుచి చూపించిన మహా యోధుడు.మాన్యశ్రీ కాన్షిరామ్ మధుమేహంతో బాధపడుతూ 1994లో గుండెపోటుకు గురయ్యాడు.1995లో మెదడులో ధమని గడ్డకట్టడం మరియు 2003లో పక్షవాతం స్ట్రోక్‌తో బాధపడ్డాడు.

కాన్షీరామ్ 72 సంవత్సరాల వయసులో తీవ్రమైన గుండెపోటుతో 2006 సంవత్సరం అక్టోబర్ 9న ఈ లోకాన్ని, బహుజన సమాజాన్ని విడిచి శాశ్వతంగా వెళ్లిపోయాడు.కాన్షీరామ్ కోరిక ప్రకారం,అంత్యక్రియలు బౌద్ధ సంప్రదాయం ప్రకారం జరిగాయి.

మాయావతి చితి వెలిగించారు.కాన్షిరాం చితాభస్మాన్ని ఒక కలశంలో ఉంచి ప్రేరణ స్థల్‌లో ఉంచారు.

అక్కడ చాలా మంది ప్రజలు నివాళులర్పించారు.అప్పటి భారత ప్రధాని మన్మోహన్ సింగ్ తన సంతాప సందేశంలో, కాన్షీరామ్ “మన కాలంలోని గొప్ప సంఘ సంస్కర్తలలో ఒకరు,అతని రాజకీయ ఆలోచనలు మరియు ఉద్యమాలు మన రాజకీయ పరిణామంపై గణనీయమైన ప్రభావాన్ని చూపాయి.

అతనికి సామాజిక మార్పుపై పెద్ద అవగాహన ఉంది.మన సమాజంలోని వివిధ వెనుకబడిన వర్గాలను ఏకం చేయగలిగింది మరియు వారి గొంతులను వినిపించే రాజకీయ వేదికను అందించగలిగిందని పేర్కొన్నారు.

కౌటిల్యున్ని సైతం తలదన్నే రాజనీతి,రాజకీయ చతురత కలిగిన సామాజిక శాస్త్రవేత్త మాన్యశ్రీ కాన్షీరాం వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనమైన నివాళులు అర్పిస్తూ…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube