రాజన్న సిరిసిల్ల జిల్లా : ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం చేకూర్చాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు.కలెక్టరేట్లో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధ్యక్షతన జిల్లా స్థాయి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం శుక్రవారం నిర్వహించారు.
జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి విజయ లక్ష్మి, ఎస్సీ కార్పొరేషన్ కార్యనిర్వహక సంచాలకులు స్వప్న జిల్లాలో అమలవుతున్న పథకాలు, అభివృద్ది పనులపై వివరించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో ఎంక్వైరీ వేగంగా పూర్తి చేసి చార్జీ షీట్ వేస్తే బాధితులకు న్యాయంతో పాటు ప్రభుత్వ నిబంధనల మేరకు పరిహారం అందుతుందన్నారు.
ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.ప్రభుత్వ శాఖల సహకారంతో జిల్లాలో అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు బాధితులకు న్యాయం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
జిల్లాలో ఎస్టీ పథకాల ప్రయోజనాలు గిరిజనులు అందిపుచ్చుకునేలా, అలాగే వారి సమస్యలను జిల్లా యంత్రాంగానికి తెలియజేసేలా చూడాలని సంబంధిత అధికారిని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.ఖీమ్యా నాయక్, అదనపు ఎస్పీ చంద్రయ్య, వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీఓ లు రమేష్, రాజేశ్వర్, ఎస్సీ సంక్షేమ అధికారిణి విజయలక్ష్మీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాములు, ఎస్సీ కార్పోరేషన్ ఈడీ స్వప్న, ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జనార్ధన్, సభ్యులు సుధాకర్, రాంచందర్, తిరుపతి, బాలయ్య, బాలరాజు, ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.