నల్లగొండ జిల్లా: నాగార్జునసాగర్ జలాశయం నుండి బుధవారం సాయంత్రం సాగర్ డ్యాం రెండు గేట్లను ఎత్తి దిగువనకు నీటి విడుదల చేస్తున్నారు.సాగర్ జలాశయం నీటి మట్టం 590 అడుగుల పూర్తిస్థాయిలో ఉండడం, డ్యాం గేట్ల పైనుండి నీరు జారిపడుతూ ఉండటంతో రెండు గేట్ల ద్వారా నీటి విడుదల చేసినట్లు డ్యామ్ అధికారులు తెలిపారు.
శ్రీశైలం నుండి నాగార్జునసాగర్ కు 63,123 క్యూసెక్కుల నీరు వస్తుండగా సాగర్లోని కుడి ఎడమ కాలువలు ప్రధాన జలవిద్యుత్ కేంద్రం, ఎస్ఎల్బీసీ,వరద కాలువ ద్వారా నీటి విడుదల చేస్తూ మిగిలిన మొత్తాన్ని సాగర్ డ్యాం రెండు గేట్లను ఐదు అడుగుల మేరకు ఎత్తి16,200 క్యూసెక్కుల నీటిని దిగునకు విడుదల చేస్తున్నారు.
నాగార్జునసాగర్ జలాశయానికి వస్తున్న వరద నీరు తగ్గుముఖం పట్టడంతో మూడు రోజుల క్రితమే సాగర్ డ్యామ్ గేట్లను డ్యామ్ అధికారులు మూసివేశారు.
తాజాగా బుధవారం రెండు గేట్ల ద్వారా నీటి విడుదల చేస్తున్నారు.కాగా స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నాగార్జునసాగర్ డ్యామ్ కు జాతీయ జెండాను ప్రతిబింబించేలా మూడు రంగుల రూపంలో ఆకర్షణయంగా కనిపించేలా విద్యుత్ బల్బులను పెట్టి సుందరంగా తీర్చిదిద్దారు.
మువ్వన్నెల జెండా రంగులతో సాగర్ డ్యాం ఆకర్షణీయంగా మారడంతో పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటుంది.