ఇజ్రాయెల్ – హమాస్ ( Israel – Hamas )యుద్ధం మధ్యలో ఇరాన్, హెజ్బొల్లాలు( Iran , Hezbollah ) జోక్యం చేసుకోవడం.దానికి ఇజ్రాయెల్ ప్రతిదాడులతో పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి.
అన్నింటికి మించి హమాస్ చీఫ్ హనియాను తమ భూభాగంపై హతమార్చడంతో ఇరాన్ రగిలిపోతోంది.దీంతో ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడికి ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ( Ayatollah Ali Khamenei ) ఆదేశాలు జారీ చేసినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇరాన్ దాని మిత్రదేశాలు ఇజ్రాయెల్‌పై ఏ క్షణమైనా దాడి చేసే ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అటు హనియాతో పాటు తమ సైనికాధిపతి మహమ్మద్ డెయిఫ్‌ను( Army Chief Mohammad Deif ) ఇజ్రాయెల్ హతమార్చడంతో హమాస్ సైతం ప్రతీకారంతో రగిలిపోతోంది.దీనికి తోడు లెబనాన్‌లోని మిలిటెంట్ గ్రూప్ హెజ్బొల్లా సీనియర్ మిలిటరీ కమాండర్ ఫాద్ షుక్రె సైతం ఇజ్రాయెల్ దాడిలో ప్రాణాలు కోల్పోవడంతో ఈ ఉగ్రవాద సంస్థ సైతం భగ్గుమంటోంది.ఇలా నలుదిక్కుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో ఐడీఎఫ్ అప్రమత్తమైంది.
అటు అమెరికా సైతం ఇజ్రాయెల్‌కు రక్షణగా నిలిచింది.పశ్చిమాసియాకు యుద్ధ నౌకలు, ఫైటర్ జెట్లు, బాలిస్టిక్ క్షిపణి సామర్ధ్యం కలిగిన క్రూజర్లు, డిస్ట్రాయర్లను మోహరిస్తోంది.
ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు జో బైడెన్( President Joe Biden ).ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో మాట్లాడి పరిస్ధితిని తెలుసుకున్నారు.
ఈ పరిణామాలతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయ పౌరులు( Indian citizens ) అప్రమత్తంగా ఉంటూ భద్రతా నియమాలను పాటించాలని సూచించింది.అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండాలని, భారతీయుల భద్రతకు సంబంధించి ఇజ్రాయెల్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేస్తున్నామని అక్కడి భారతీయ రాయబార కార్యాలయం వెల్లడించింది.ఇప్పటికే పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్ధితుల నేపథ్యంలో ఎయిరిండియా సహా పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేశాయి.
లెబనాన్‌లోని ఇండియన్ ఎంబసీ కూడా అక్కడి భారతీయుల భద్రతపై అడ్వైజరీ జారీ చేసిన సంగతి తెలిసిందే.