సూర్యాపేట జిల్లా: నడిగూడెం మడలం రత్నవరం నుండి మునగాల మండలం ఆకుపాముల వరకు 9 కి.మీ.
ప్రధాన రోడ్డున ఏడాదిన్నర క్రితం పునర్నిర్మాణం కోసం తవ్వి కంకర,డస్ట్ పరిచి,తారు పోయకుండా వదిలేసి పోయారు.నిత్యం రెండు మండలాలకు చెందిన ప్రజలు,రైతులు, వ్యాపారస్తులు,స్కూల్,కాలేజీలకు వెళ్ళే విద్యార్దులు,వివిధ రకాల ఉపాధి కోసం వెళ్ళే వారు ప్రయాణించే రహదారిపై కంకర,డస్ట్ ఉండడంతో ప్రయాణం చేయకలేక నానా అవస్థలు పడుతున్నారు.
ఈ రహదారిపై చాకిరాల, సిరిపురం,రత్నవరం, రామాపురం,ఇ.కె.పేట,తెల్లబల్లి,కోదండరాంపురం గ్రామాల ప్రజలు కోదాడ, సూర్యాపేట జిల్లా( Suryapet District ) కేంద్రానికి రాకపోకలు సాగిస్తుంటారు.ఈ రోడ్డుపై ప్రయాణించే కొత్త వాహనాలు కూడా త్వరగా రిపేర్ కు వస్తున్నాయి.
డస్ట్ లేవడంతో రహదారి పక్కన గ్రామాల ప్రజలు రోగాల బారినపడి హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడుతున్నారు.
అయినా సదరు కాంట్రాక్టర్,ప్రభుత్వ అధికారులు సంవత్సర కాలంగా ఈ రహదారి వైపు కన్నెత్తి చూసిందిలేదని ఈ ప్రాంత ప్రజలు,వాహన చోదకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వాహనాల రాకపోకలతో దుమ్ములేచి వెనుక వాహనదారుల కళ్లలో దుమ్ముపడి ఒక వాహనం వెళ్ళాక మరో వాహనం వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు.అంతేకాకుండా రాహదారిపై వున్న కంకరరాళ్ల వల్ల ద్విచక్ర వాహనాలు జారిపడి ప్రయాణీకులు గాయపడిన సంఘటనలు ఉన్నాయని, ఇంత జరుగుతున్నా ఆర్&బి శాఖ అటువైపు తొంగిచూసిన పాపాన పోలేదని,ఆశాఖ ఏఈని సంప్రదించినా సరైన సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నారని ఆరోపిస్తున్నారు.
స్టానిక ఎమ్మెల్యేకి సైతం వినతి పత్రం అందించి మూడు నెలలైనా ఇంతవరకు అతిగతి లేదని బాటసారులు పెదవి విరుస్తున్నారు.ఎన్నికల కోసం నవంబర్ నుంచి ఇప్పటి వరకు ఇదే రాహదారిపై మంత్రి ఉత్తమ్( Minister Uttam Kumar Reddy ),ఎమ్మెల్యే పద్మావతి,పార్లమెంటు అభ్యర్ధి రఘువీర్ రెడ్డి లాంటి నాయకులు తిరుగుతున్నా నాయకులు,అధికారులు బాటసారుల, వాహనదారుల కష్టాలను, ఇబ్బందులు కనిపించక పోవడంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అందరూ చూస్తూ కూడా పట్టించుకోకపోవడంతోఎవరికి చెప్పాలో తెలియక ఆటోదారులు,ద్విచక్ర వాహనదారులు ఈ రోడ్డుకు మోక్షం ఎప్పుడు సారూ అంటూ అలాగే ప్రయాణాలు చేస్తున్నారు.ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి రహదారిని నిర్మిచాలని ప్రజలు కోరుతున్నారు.