ఏపీలో టిడిపి, జనసేన, బిజెపి( TDP, Janasena, BJP )లు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్తున్నాయి.పొత్తులో భాగంగా మూడు పార్టీలు సీట్ల పంపకాలు చేపట్టాయి.
అయితే ఇప్పుడు కూటమి పార్టీలో ఉన్న జనసేన పార్టీ కారణంగా మొత్తం కూటమిలో ఉన్న పార్టీలు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.జనసేన పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసును జనసేన అభ్యర్థులు పోటీ చేయని మిగతా నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడమే కారణం.
నిన్నటితో నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయింది.అయితే జనసేన అభ్యర్థులు పోటీ చేయని నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయిస్తూ రిటర్నింగ్ అధికారులు నిర్ణయం తీసుకోవడం కూటమి పార్టీలకు ఇబ్బందికరంగా మారింది.
జనసేన మొత్తం 21 అసెంబ్లీ స్థానాల్లో, రెండు పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేస్తుంది.
మిగిలిన నియోజకవర్గాల్లో టిడిపి, బీజేపీలు పోటీ చేస్తున్నాయి.అయితే ఆయా నియోజకవర్గల్లో గాజు గ్లాస్( Glass symbol ) గుర్తును స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడం, టిడిపి, బిజెపి లకు ఆందోళన కలిగిస్తోంది.జనసేన పార్టీ స్థాపించి దాదాపు 10 ఏళ్లు దాటుతోంది.2014లో జరిగిన ఎన్నికలకు జనసేన దూరంగా ఉంది.కానీ 2019 ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసి కేవలం ఒక్క నియోజకవర్గంలో మాత్రమే విజయం సాధించింది.ఓటింగ్ శాతం కూడా ఆరు శాతానికి మించలేదు.2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేయడంతో, ఆ పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు.దీనిపై న్యాయపరంగా ఎన్ని పోరాటాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.చాలా చోట్ల టిడిపి, జనసేన తరఫున రెబల్ అభ్యర్థులుగా పోటీకి దిగిన వారికి గాజు గ్లాసు గుర్తు కేటాయించడంతో కూటమి పార్టీల్లో ఆందోళన మొదలైంది.
దాదాపు 25 నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ లకు గాజు గ్లాస్ గుర్తులు కేటాయించినట్లు తెలుస్తోంది.నెల్లూరు టౌన్ లో కూడా బిజెపి రెబల్ గా పోటీ చేస్తున్న అభ్యర్థికి గాజు గ్లాస్ గుర్తు దక్కింది.ఇప్పుడు గాజు గ్లాస్ కారణంగా టిడిపి, బిజెపి లకు పడాల్సిన ఓట్లకు గండం పడుతుందనే టెన్షన్ ఆయా పార్టీల్లో నెలకొంది.గ్రామీణ ప్రాంతాల్లో ఈవీయం లో పేరును చూసి కాకుండా గుర్తును చూసి ఓటేసే వారే ఎక్కువగా ఉండడంతో, ఓట్ల చీలిక ఎక్కువగా ఉంటుందనే అంచనాలు కూటమి నేతల్లో ఉన్నాయి.
దీంతో జనసేన పోటీ చేయని( Janasena ) నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ గుర్తుకు ఎవరూ ఓటు వేయవద్దని విస్తృతంగా ప్రచారం చేసేందుకు మూడు పార్టీలు సిద్ధమవుతున్నాయి.