నల్లగొండ జిల్లా:ఓటు హక్కుపై కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో శనివారం ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను నల్గొండ పార్లమెంటు సాధారణ ఎన్నికల పరిశీలకులు, సీనియర్ ఐఏఎస్ అధికారి మనోజ్ కుమార్ మాణిక్ రావ్ సూర్యవంశీ సందర్శించారు.ఎన్నికల ప్రస్తానంతో పాటు,ఓటరు గైడ్ పై సిబిసి ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను ఆయన ఆసక్తిగా తిలకించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఓటర్లలో చైతన్యం కోసం ఇలాంటి ఫోటో ఎగ్జిబిషన్లు విస్తృతంగా నిర్వహించాలన్నారు.ప్రతి ఒక్క ఓటరు తమ హక్కును ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
స్వీప్ కార్యక్రమం కింద మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో,స్వీప్ నోడల్ అధికారి ఎన్.ప్రేమ్ కరణ్ రెడ్డి,జిల్లా సమాచార,ప్రచార సంబంధాల శాఖ సహాయ సంచాలకులు యు.వెంకటేశ్వర్లు,సీబీసీ జిల్లా ఫీల్డ్ పబ్లిసిటి అధికారి కోటేశ్వరరావు, ఐకేపీ డీపీఎం అరుణ్ కుమార్,ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఘన్ శ్యామ్, లైబ్రేరియన్ రాజారాం, భోదనా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.