ఇజ్రాయెల్ – పాలస్తీనా ( Israel – Palestine )యుద్ధ ప్రభావం పలు దేశాలపై నేరుగా పడుతోంది.ఇజ్రాయెల్‌కు మద్ధతుగా కొందరు, పాలస్తీనాకు మద్ధతుగా మరికొందరు ర్యాలీలు నిర్వహిస్తున్నారు.
ఇవి కొన్నిచోట్ల హింసాత్మంగా మారి శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతున్నాయి.అగ్రరాజ్యం అమెరికాలోని యేల్, కొలంబియా, న్యూయార్క్ యూనివర్సిటీలు సహా అనేక విశ్వవిద్యాలయాలలో ఇజ్రాయెల్ వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో ఇజ్రాయెల్ – పాలస్తీనా యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ( Joe Biden ) విధానాలపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విమర్శలు గుప్పించారు.బైడెన్ కారణంగానే అమెరికన్ యూనివర్సిటీలలో ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనలు జరుగుతున్నాయన్నారు.
హుష్ మనీ ట్రయల్‌లో భాగంగా మంగళవారం మన్‌హట్టన్ కోర్టు( Manhattan Court ) ఎదుట హాజరవ్వడానికి ముందు ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.కళాశాలల్లో అసలు ఏం జరుగుతోందని ఆయన ప్రశ్నించారు.
బైడెన్ ఎవరికి మద్ధతు ఇస్తున్నాడో అతనికైనా తెలుసా.పరిస్ధితి గందరగోళంగా వుందంటూ ఎద్దేవా చేశారు.
బైడెన్ అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త అధ్యక్షుడిగా ట్రంప్( Trump ) అభివర్ణించారు.ఇజ్రాయెల్‌కు కానీ , అరబ్ ప్రపంచానికి కానీ బైడెన్ స్నేహితుడు కాదని తాను ఖచ్చితంగా చెప్పగలనని అన్నారు.
కాగా.న్యూయార్క్ యూనివర్సిటీ క్యాంపస్‌లో( New York University ) పాలస్తీనా అనుకూల నిరసనలు నిర్వహించిన దాదాపు 130 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రకారం.వీరందరికీ కోర్టు సమన్లు జారీ చేసిన తర్వాత విడుదల చేశారు.సోమవారం రాత్రి పాస్ ఓవర్ సెలవు దినం ప్రారంభంకావడంతో న్యూయార్క్ యూనివర్సిటీలోని ఒక శిబిరం వద్ద నిరసనకారులను పోలీసులు నిర్బంధించడం ప్రారంభించారు.
తొలుత ప్లాజాలో వున్న వారిని శాంతియుతంగా అక్కడి నుంచి వెళ్లిపోవాల్సిందిగా పోలీసులు కోరారు.అయితే వారి సూచనలను భేఖాతరు చేయడంతో ఆందోళనకారులను అరెస్ట్ చేసినట్లు న్యూయార్క్ యూనివర్సిటీ ప్రతినిధి తెలిపారు.అటు కొలంబియా వర్సిటీలోనూ ప్రదర్శనకారులు గాజా సాలిడారిటి శిబిరాన్ని ఏర్పాటు చేయడంతో నిరసనలు ప్రారంభమయ్యాయి.
ఈ నేపథ్యంలో వర్సిటీ అధికారులు పోలీసులకు సమాచారం అందించారు.ఈ సందర్భంగా దాదాపు 100 మంది నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.