బంతిపూలకు ( Marigold Flowers ) మార్కెట్లో ఎప్పుడు మంచి డిమాండే ఉంటుంది.ఇక పండుగలు, శుభకార్యాలు వచ్చాయంటే బంతిపూల ధర ఎంత పెరుగుతుందో తెలిసిందే.
వాతావరణ పరిస్థితులను బట్టి, మార్కెట్లో పూలకు ఉండే డిమాండ్ ను బట్టి జూలై మొదటి వారం నుండి ఫిబ్రవరి మొదటి వారం వరకు బంతి పంటను ( Marigold Crop ) నాటుకునేందుకు అనుకూలమైన సమయం.అయితే వర్షాకాలంలో అధిక వర్షాల వల్ల, వేసవికాలంలో హెచ్చు ఉష్ణోగ్రత వల్ల పూల నాణ్యత దెబ్బతినే అవకాశం ఉంది.
రైతులు వీటిని దృష్టిలో పెట్టుకుని సాగు చేపట్టాలి.
బంతి పంట సాగుకు నీరు ఇంకిపోయే నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి.నేల యొక్క పీహెచ్ విలువ 7.0-7.5 మధ్య ఉండే నేలలు ఈ పంట సాగుకు అనుకూలం.బంతి పంట సాగు చేసే నేలలో ఎక్కువ నీడ ఉండకూడదు.
ఎందుకంటే నీడ ఉంటే మొక్కలు పెరుగుతాయి కాని పువ్వులు మాత్రం పూయవు.ప్రధాన పొలంలో నాటుకునేందుకు ఆరోగ్యకరమైన మొక్కలను ఎంపిక చేసుకోవాలి.

మొక్కల వయసు సుమారుగా ఒక నెల ఉండి, మూడు లేదా నాలుగు ఆకులు ఉండే మొక్కలను నాటుకోవాలి.సాయంత్రం సమయంలో నాటుకుంటే మొక్కలు బాగా పాతుకుంటాయి.ఇక మొక్కల మధ్య, మొక్కల వరుసల మధ్య కాస్త అధిక దూరం ఉంటే మొక్కలకు సూర్యరశ్మితో పాటు గాలి బాగా తగిలి ఆరోగ్యకరంగా పెరుగుతాయి.బంతి పంటకు అందించాల్సిన ఎరువుల విషయానికి వస్తే ఒక ఎకరాకు 20 టన్నుల పశువుల ఎరువుతో( Cattle Manure ) పాటు 40 కిలోల నత్రజని, 80 కిలోల భాస్వరం, 80 కిలోల పొటాష్ ఎరువులను ఆఖరి దుక్కిలో వేసుకోవాలి.

ఇక నేలలోని తేమశాతాన్ని( Moisture ) బట్టి పంటకు నీటితడులు అందించాలి.మొక్కలు ఏ దశలోనైనా నీటి ఎద్దడికి గురైతే మొక్కల పెరుగుదల తగ్గడంతో పాటు పూల దిగుబడి తగ్గుతుంది.పొలంలో తేమతో కూడిన వెచ్చని వాతావరణం ఉంటే ఆకుమచ్చ తెగుళ్లు ఆశించే అవకాశం ఉంది.ఈ తెగుల నివారణకు తోటను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఒక లీటర్ నీటిలో 2.5 గ్రాముల మాంకోజెబ్ ను కలిపి పిచికారి చేయాలి.