నల్లగొండ జిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లా( Nalgonda District )లో రహదారుల రక్త దాహం కొనసాగుతుంది.ఆదివారం రాత్రి,సోమవారం ఉదయం,మంగళవారం ఉదయం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందగా పలువురు క్షతగాత్రులయ్యారు.
వివరాల్లోకి వెళితే నల్లగొండ జిల్లా పెద్దవూర మండల కేంద్రం శివారులోని కాటన్ మిల్ సమీపంలో ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు( Two wheelers ) ఢీ కొని పెద్దవూర మండలం పంగవానికుంట గ్రామానికి చెందిన నీలం మహేందర్ (21) అక్కడిక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన నేనావత్ లచ్చు నల్లగొండ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మధ్యాహ్నం మరణించినట్లు పెద్దవూర ఎస్సై వీరబాబు తెలిపారు.సూర్యాపేట జిల్లా మునగాల మండలం ముకుందాపురం వద్ద నేషనల్ హైవే 65 పై సోమవారం ఉదయం హైదారాబాద్ నుండి విజయవాడ వెళుతూ ఆగివున్న కంటైనర్ కిందికి కారు వేగంగా దూసుకెళ్లిన ఘటనలో శ్రీ చైతన్య కాలేజ్ విజయవాడలో లెక్చరర్ గా పని చేస్తున్న సామినేని నవీన్ రాజా (29),అతని భార్య సామినేని భార్గవి(24) స్పాట్ డెడ్ అయ్యారు.
మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
మంగళవారం ఉదయం మునగాల మండల కేంద్రం హైదారాబాద్ నుండి అమలాపురం వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు రోడ్డుకు అడ్డంగా వచ్చిన బర్రెలను తప్పించబోయి నివాసాల మీదకు దూసుకెళ్లింది.
ఈ ప్రమాద సమయంలో బస్సులో 30 మంది ప్రయాణికులు ఉండగా పలువురికి స్వల్ప గాయాలయ్యాయి.ఘటనా స్థలానికి చేరుకుని లారీ కింద ఇరుక్కున్న కారును క్రేన్ సహాయంతో బయటికి తీసి,మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం కోదాడ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్ఐ అంజిరెడ్డి తెలిపారు.
ఈ ప్రమాదాల్లో అజాగ్రత్త,అతి వేగమే ప్రధాన కారణమని పోలీసులు భావిస్తున్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ మధ్య కాలంలో వరుస ప్రమాదాలు జిల్లా ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయి.