సూర్యాపేట జిల్లా: ప్రేమించి పెళ్లికి కులం అడ్డొస్తుందని తనకు అన్యాయం చేస్తున్న ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగిన సంఘటన ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో వెలుగులోకి వచ్చింది.తనకు న్యాయం జరిగే వరకూ ఇక్కడి నుండి కదిలేది లేదని పట్టుబట్టింది.
వివరాల్లోకి వెళితే…సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుర్రం తండాకు చెందిన డుంగ్రోతు శ్యామ్ నాయక్ కుమార్తె భవాని స్ధానిక వికాస్ కాలేజ్ నందు డి ఫార్మసి మొదటి సంవత్సరం చదువుతున్నది.అదే కాలేజిలో నాలుగవ సంవత్సరం చదువుతున్న సూర్యాపేట పట్టణంలోని బొడ్రాయి బజార్ కు చెందిన అంతటి మహేష్ తో ప్రేమలో పడింది.
ఇద్దరి ప్రేమ వ్యవహారం కాలేజ్ లో కూడా అందరికి తెలుసని అమ్మాయి తెలిపింది.
తనను ప్రేమించి,ఇప్పుడు పెళ్లి చేసుకోమని అంటే కులాంతర వివాహానికి తన తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని తప్పించుకుంటున్నాడని,తనను మోసం చేయడంతో తనకు న్యాయం జరిగే వరకూ తన తల్లిదండ్రులతో కలిసి మహేష్ ఇంటి వద్ద ధర్నాకు దిగినట్లు తెలిపింది.
తాను మహేష్ ని ప్రేమించానని,అతనిని తప్ప మరెవరని పెళ్లి చేసుకోనని, తాను చావుకైనా సిద్దమని తెగేసి చెబుతుంది.అమ్మాయి తల్లిదండ్రలు మాట్లాడుతూ మహేష్ తల్లిదండ్రులు తమ కుమార్తెతో వివాహానికి ఇష్ట పడడం లేదని,కులాంతర వివాహం తమకు ఇష్టం లేదని అన్నారని,తాము ఇప్పటికే సూర్యాపేట షిటీమ్ లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.
తమ కూతురికి న్యాయం చేసేవరకు పోరాడుతామన్నారు.విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ధర్నా చేస్తున్న అమ్మాయిని, కుటుంబ సభ్యులను పోలీసు స్టేషను కు తరలించారు.