వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేయాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు బిజెపి సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు( Gvl Narasimha Rao ).గత మూడేళ్లుగా విశాఖలోనే ఉంటూ అక్కడ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.
వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి నిధులు మంజూరు చేస్తూ, స్థానికంగా అనేక కార్యక్రమాలు చేపడుతూ, ప్రజల్లో తన గురించి చర్చ జరిగేలా చేసుకుంటూ వస్తున్నారు.బిజెపి ఎంపీ అభ్యర్థిగా విశాఖ నుంచి పోటీ చేయాలని భావిస్తూ వస్తున్నారు.
టిడిపి, జనసేన, బిజెపి( TDP, Janasena, BJP ) పొత్తులో భాగంగా విశాఖ ఎంపీ స్థానాన్ని టిడిపి తీసుకోవడంతో, అక్కడ ఆ పార్టీ అభ్యర్థిగా భరత్ పేరును ప్రకటించారు.దీంతో మరోచోట అయినా తనకు అవకాశం ఇస్తారని జీవీఎల్ భావించినా, ఆయనకు నిరాశే ఎదురయింది.
అయితే ఎక్కడో కడప జిల్లాకు చెందిన బిజెపి నేత సీఎం రమేష్ ను తీసుకొచ్చి అనకాపల్లి సీటు ఇవ్వడంపై జీవీఎల్ మరింతగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తాను విశాఖలో మూడేళ్లుగా అనేక పనులు చేస్తున్నానని, అయినా తనకు టికెట్ నిరాకరించారని, ఈ విషయం తనకు చాలా బాధను కలిగించిందని, త్వరలోనే తన భవిష్యత్తు కార్యాచరణను ప్రకటిస్తానంటూ జీవీఎల్ ప్రకటించారు.మూడేళ్ల నుంచి విశాఖ( Visakhapatnam)లోనే తాను ఉన్నానని, స్థానిక ప్రజలకు చేరువయ్యానని, వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తున్నానని, అందరితోనూ కలిసి మూడేళ్ల నుంచి విశాఖ అభివృద్ధికి ఎంతగానో పాటుపడ్డానని జీవిఎల్ చెబుతున్నారు.తాను చేసిన సేవ నిస్వార్ధమైందని , కాకపోతే అది వృధా అయ్యిందని, అయినా తాను కుంగిపోవడం లేదని జీవీఎల్ చెబుతున్నారు.
రాబోయే రోజుల్లో మరింతగా కష్టపడతానని ప్రకటించారు.అసలు వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తాను సేవ చేయలేదని జీవీఎల్ చెబుతున్నారు, ‘ జీవీఎల్ ఫర్ వైజాగ్ ‘ అనేది నిరంతర ప్రక్రియ అని, ఇది కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు.త్వరలోనే విశాఖకు వస్తానని, తన అనుచరులతో కలిసి భవిష్యత్తు కార్యాచరణ పై చర్చిస్తానని ప్రకటించారు.బిజెపిపై తనకు ఎటువంటి వ్యతిరేకత లేదని, కాకపోతే తనకు టికెట్ రాకుండా కొంతమంది అడ్డుకున్నారని జీవీఎల్ మండిపడుతున్నారు.