నల్లగొండ జిల్లా: నవ మాసాలు మోసి బిడ్డకు జన్మనిచ్చిన కన్నతల్లికి ఆ పేగు బంధం భారమైంది.పుట్టగానే తల్లి వెచ్చని పొత్తిళ్ళలో సేద తీరాల్సిన పసిగుడ్డును కనికరమనేదే లేని కసాయి తల్లి పట్టపగలు ఎర్రటి ఎండలో ముళ్ళ కంచెలో పడేసిన అమానవీయ సంఘటన సోమవారం నల్లగొండ జిల్లా చండూర్ మండలం బంగారిగడ్డ గ్రామంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం…
మధ్యాహ్న సమయంలో బంగారిగడ్డ గ్రామంలోని సుంకరి యాదయ్యకు చెందిన వ్యవసాయ భూమిలో కంపచెట్ల మధ్య పడి ఉన్న అప్పుడే పుట్టిన మగ శిశువు అటుగా వెళ్ళిన స్థానికులు గుర్తించారు.బయటికి తీసి 108 అంబులెన్స్ కి సమాచారం అందించారు.
వెంటనే అక్కడికి చేరుకున్న 108 సిబ్బంది నిర్జీవంగా ఉన్న శిశువును పరీక్షించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి,కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఉప్పు సురేష్ తెలిపారు.