సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో ఓ బీఆర్ఎస్ నాయకుడు శంకర్ మణికంఠ( Shankar Manikantha ) ఔట్ సోర్సింగ్ సర్వీసెస్ పేరిట కలెక్టర్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు( Out sourcing Jobs ) ఇప్పిస్తామని నమ్మించి అమాయక ప్రజల నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేసి, చివరికి కుచ్చుటోపీ పెట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ సందర్భంగా బాధితులు మాట్లడుతూ బీఆర్ఎస్ పార్టీ( BRS party ) రాష్ట్ర నాయకుడిని అంటూ మణికంఠ ఔట్ సోర్సింగ్ సర్వీసెస్ నిర్వాహకుడు శంకర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సానిటేషన్ విభాగంలో స్వీపర్, అటెండర్ ఉద్యోగాలు ఉన్నాయని మోసపూరిత ప్రకటనలు,మయమాటలు చెప్పి ఒక్కొక్కరి దగ్గరి నుండి రెండు లక్షల చొప్పున వసూలు చేశాడని,కలెక్టరేట్ లో మణికంఠ ఔట్ సోర్సింగ్ సర్వీసెస్ పేరిట జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో నమోదు చేసుకున్న కాగితం చూపి తాను ఉద్యోగాలు ఇస్తానని నమ్మబలికి బురిడీ కొట్టించాడని,మొదటగా నమ్మకం కలిగేందుకు ముగ్గురికి లేని ఉద్యోగాలు వచ్చాయని నకిలీ నియామక పత్రాలు అందించాడని,మీరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదని, కలెక్టర్ కార్యాలయానికి వెళ్ళండని చెప్పి పంపడంతో ఆ ముగ్గురు రోజు కలెక్టరేట్ కి వెళ్లి వస్తుండగా వారికి మూడు నెలలుగా నిందితుడు 8 వేల రూపాయలు సొంతంగా జీతం ఇస్తున్నాడని,ఈ ఉదంతాన్ని నమ్మిన మరికొంతమంది బాధితులు లక్షల్లో డబ్బులు కుమ్మరించినట్లుఆరోపించారు.
నెలలు గడుస్తున్నా ఉద్యోగాలు రాకపోవడంతో మోసపోయామని గ్రహించి చివరికి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది.