నల్లగొండ జిల్లా:నందికొండ మున్సిపాలిటీలో ఆరు నెలలుగా ఆధార్ నమోదు కేంద్రాలు మూతపడి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.గతంలో మీసేవ,మున్సిపాలిటీలో ఆధార్ సెంటర్లు నడిచేవి.
నమోదు పక్రియలో కొన్ని పొరపాట్లు దొర్లడం వల్ల ఆపరేటర్లను తొలగించారు.వారిస్థానంలో తిరిగి కొత్తవారిని నియమించాల్సి ఉన్నా అందుకోసం జిల్లా ఆధార్ కేంద్రం యూఐడీ నిర్వాహకులు ముందుకు రాకపోవడంతో ఈసమస్య వెంటాడుతున్నది.
దీనితో కొత్త ఆధార్ కార్డుకు దరఖాస్తు చేసుకోవాలన్నా, చేర్పులు,మార్పులు కావాలన్నా పక్క రాష్ట్రం ఏపిలోని మాచర్లకు వెళ్లాల్సి వస్తుందని, అక్కడకు వెళ్లినా పనులు త్వరితగతిన కాక పొద్దస్తమానం ఎదురుచూడాల్సి వస్తుందని వాపోతున్నారు.ప్రస్తుతం వివిధ ప్రభుత్వ పథకాలకు ఆధార్ తప్పనిసరి కావడంతో ప్రతి ఆధార్ కేంద్రంలో ప్రజలు బారులు తీరుతున్నారని, నందికొండ మున్సిపాలిటీ వాసులు దూరప్రాంతాలకు వెళ్లి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని,రేషన్ కార్డ్ అప్డేట్ చేసుకోవడం ఈనెల 29 చివరి రోజు కావడంతో ప్రజలు పక్క రాష్ట్రానికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు.
ఇప్పటికైనా అధికారులు స్పందించి మూతపడిన ఆధార్ కేంద్రాలను తెరిపించాలని కోరుతున్నారు.ఆధార్ కేంద్రం లేక ఇబ్బంది పడుతున్నామని జాటవత్ బాలాజీ అంటున్నారు.
నాకు ఒక కూతురు,ఒక కొడుకు ఉన్నారు.రేషన్ కార్డు లింక్ కోసం రేషన్ షాపునకు వెళ్లాను.
అక్కడ పిల్లల వేలి ముద్రలు పడకపోవడంతో ఆధార్ అప్డేట్ చేసుకోవాలని సూచించారు.నందికొండ ఆధార్ సెంటర్‌కు వెళ్లితే మూతపడి ఉన్నాయి.
పిల్లల స్కూల్ బంద్ చేసుకొని దూరప్రాంతాలకు వెళ్లలేక పోతున్నా.వెంటనే మూతపడిన ఆధార్ కేంద్రాలను తెరిపించాలని అన్నారు.