నల్లగొండ జిల్లా:గత ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ లో 2017 సెప్టెంబర్ లో నిర్వహించిన మహా బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వచ్చే సమయంలో పబ్లిక్ గార్డెన్ గేట్ చువ్వ తలకు గుచ్చుకొని నల్లగొండ జిల్లా కేందానికి చెందిన సృజన అక్కడిక్కడే మృతి చెందిన విషయం తెలిసిందే.మృతురాలికి ఇద్దరు పసి పిల్లలు ఉండగా భర్త కూడా లేకపోవడంతో ఆ ఇద్దరు చిన్నారులు అనాథలుగా మారారు.
అయితే ఆ పిల్లలను సృజన చెల్లెలు, నల్లగొండ పట్టణంలోని ఆర్టీసీ కాలనీకి చెందిన కందుల సాయిశ్రీలత పెంచుతుంది.పేద కుటుంబానికి చెందిన సాయిశ్రీలతకు పిల్లల పోషణ భారమై ఆనాటి ప్రభుత్వానికి,ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఆదుకోవాలని కోరారు.
కొంత ఆర్ధిక సహాయం చేసిన కవిత,ఆమెకు ప్రభుత్వ ఉద్యగం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కి లెటర్ కూడా రాసింది.కానీ,ఆరేళ్లు అయినా ఇంత వరకూ అతీగతీ లేదని,గత ప్రభుత్వ బాధితులను కాంగ్రెస్ సర్కార్ ఆదుకోవాలని సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి వినతిపత్రం అందజేశారు.
అనంతరం సాయిశ్రీలత మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మా అక్క సృజన 2017 సెప్టెంబర్ లో జరిగిన మహ బతుకమ్మ కార్యక్రమంలో పాల్గొని నల్గొండకు తిరుగు ప్రయాణంలో మృతి చెందినా నేటి వరకు ఇస్తానన్న ఉద్యోగం ఇవ్వలేదని,నాటి ఎమ్మెల్సీ కవిత,మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డిలు స్పందించి ఉద్యోగం కొరకు కలెక్టర్ కు లెటర్ లు పంపినా స్పందన లేదని వాపోయింది.ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వంలో తనకు,పిల్లలకు న్యాయం చేయాలని వేడుకుంది.