సూర్యాపేట జిల్లా: కోదాడ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ పై కౌన్సిలర్లు శనివారం కోదాడ ఆర్డీవో సూర్యనారాయణ అధ్వర్యంలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది.మొత్తం 35 మంది కౌన్సిలర్లలో ఒకరు మృతి చెందగా ఒకరు గైర్హాజరు కావడంతో 33 మంది హాజరై 29 మంది చైర్మన్, వైస్ చైర్మన్ కు వ్యతిరేకంగా చేతులెత్తగా చైర్మన్ వనపర్తి శిరీష తరఫున నలుగురు కౌన్సిలర్ల చేతులెత్తడం విశేషం.
ఈ సందర్భంగా అసమ్మతి కౌన్సిలర్లు మాట్లడుతూ బీఆర్ఎస్ మున్సిపాలిటీ చైర్మన్ వనపర్తి శిరీషను చైర్మన్ పదవి నుండి దింపడమే ప్రధాన లక్ష్యంగా పెట్టిన అవిశ్వాసం నెగ్గిందని,ఇన్ని రోజులు బంధీలో ఉన్న తాము ఇప్పుడు సంకెళ్లు తెంపుకున్నామన్నారు.
ఈ అవిశ్వాస పరీక్షపై ఆర్టీవో మాట్లాడుతూ కోదాడ మున్సిపాలిటీ చైర్మన్,వైస్ చైర్మన్లపై అవిశ్వాసం పెట్టిన కౌన్సిలర్లు చైర్మన్,వైస్ చైర్మన్లపై 29 మంది కౌన్సిలర్లు వ్యతిరేకంగా ఓటు వేయగా,నలుగురు మాత్రమే చైర్మన్, వైస్ చైర్మన్లకు ఓటు వేయడం జరిగిందన్నారు.
ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు.