నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ మున్సిపల్ కాంప్లెక్స్ లో 92 షాపులలో దళారీ వ్యవస్థ నిర్మూలించాలని బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం మిర్యాలగూడ ఆర్డీవోకి వినతిపత్రం అందజేశారు.అనంతరం బీసీ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుమలగిరి అశోక్ మాట్లాడుతూ మిర్యాలగూడ మున్సిపల్ కాంప్లెక్స్ లో ప్రభుత్వం నిర్వహించిన షాపులకు నేటికీ టెండర్లు లేకపోవడంతో మున్సిపల్ కాంప్లెక్స్ లలో దళారీ దందా నడుస్తుందని ఆరోపించారు.
ఎంతోమంది నిరుద్యోగులు జీవన ఉపాధి కోసం వ్యాపారం చేసుకుంటూ నెలకు 25 వేల నుండి 30 వేల వరకు షాపుల యాజమాన్యాలు దళారులకు చెల్లిస్తున్నారని,మున్సిపాలిటీకి దక్కవలసిన ఆదాయానికి దళారులు గండి కొడుతున్నప్పటికీ ప్రభుత్వ అధికారులు చూసి చూడనట్టుగా వదిలేయడం వలన ఈ దళారీ దందా మరింతగా పెరిగిందని అన్నారు.షాపుల వ్యాపారులపై నెలసరి కిరాయిలు అమాంతం పెంచేస్తూ వ్యాపారం చేసుకునే నిరుద్యోగ యువతకు తీవ్ర ఇబ్బందిగా మారిందని,
మున్సిపాలిటీ షాపులు నిర్మించిన నాటినుండి ఇప్పటివరకు టెండర్లు వేయకపోవడంతో వారి సొంత షాపుల్లా చలామణి అవుతూ నిరుద్యోగ యువతకు తీవ్ర ఇబ్బందిగా మారిందన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి మిర్యాలగూడ మున్సిపాలిటీలో ఉన్న 92 షాపులకు బహిరంగ టెండర్లు పూర్తిచేసి,వ్యాపారస్తులకు మాత్రమే షాపులు దక్కేలా చర్యలు తీసుకొని దళారీ దందా లేకుండా ప్రభుత్వానికి ఆదాయం పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీసి సంఘ నాయకులు పాల్గొన్నారు.