నల్లగొండ జిల్లా: వేములపల్లి, మాడుగులపల్లి మండలాల పరిధిలో వరి నాట్ల సీజన్ ఊపందుకోవడంతో వ్యవసాయ కూలీలు(Agricultural laborers ) ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు ఆటోలను ఆశ్రయిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఒక్కో ఆటోలో లెక్కకు మించి కూలీలను ఎక్కించడంతో ఆటో ప్రయాణం ప్రమాదకరంగా మారుతుంది.
గతంలో ఈ మండలాల్లో పత్తి,మిరప కూలీలను పరిమితికి ఎక్కించుకుని వెళ్ళి వస్తున్న ఆటోలు( Autos ) ప్రమాదాలకు గురై అనేక మంది పేద కూలీలు క్షతగాత్రులు కాగా, ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఉన్నాయి.ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను తరలించడం నిషేధమని ట్రాఫిక్ నిబంధనలు ఉన్నా సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపంతో ఆటో డ్రైవర్లు నిబంధనలకు విరుద్ధంగా ఒక్కో ఆటోలో 15 నుండి 20 మందిని ఎక్కించుకొని కూలీ పనులకు తీసుకెళ్ళడం పరిపాటిగా మారింది.
ఈ క్రమంలోనే డ్రైవింగ్ సమస్యలు ఎదురై అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలు కోకొల్లలు.
లెక్కకు మించి ప్రమాదాలు జరిగినా ఎవరిలోనూ మార్పు రాకపోవడం బాధాకరం.
ఏదైనా పెనుప్రమాదం సంభవించి, భారీగా నష్టం జరిగినప్పుడు పోలీసు, ఆర్టీఏ అధికారులు హడావుడి చేయడం తర్వాత యధామామూలు కావడం ఆనవాయితీగా మారింది.వ్యవసాయ మహిళా కూలీలు కుటుంబ పోషణ కోసం కూలీ పనులకు వెళ్ళడం తిరిగి తమ తమ గమ్యస్థానానికి చేరుకునేందుకు ఆటోలను ఆశ్రయిస్తుంటారు.
ఇదే ఆసరాగా చేసుకొని కొందరు ఆటో డ్రైవర్లు ( Auto drivers )అవగాహన లోపంతో ఎక్కువమందిని ఎక్కించుకొని ప్రమాదాల బారిన పడుతున్నారు.ఇలాంటి సమయాల్లో విలువైనప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.
ఇప్పటికైనా అధికారులు స్పందించి ఆటో డ్రైవర్లకు ఓనర్లకు కౌన్సిలింగ్ ఇచ్చి,సురక్షిత ప్రయాణాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.







