ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి గెలుపే లక్ష్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాయత్తం అవుతోంది.ఈ మేరకు ఆ పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ పార్టీలో పెను మార్పులు చేయనున్నారు.
రాబోయే ఎన్నికలకు రెడీ అవుతున్న సీఎం వైఎస్ జగన్… ఇప్పటికే ఎమ్మెల్యేలుగా, నియోజకవర్గ ఇంఛార్జ్ లుగా ఉన్న వారిలో పని తీరు బాగాలేని వారిని, ప్రజల్లో వ్యతిరేకత ఉన్న వారిని తొలగించనున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పలు సమావేశాల్లో పని తీరు మార్చుకోవాలని పలువురికి వైఎస్ జగన్ సూచించిన విషయం తెలిసిందే.
అయినప్పటికీ కొందరు నేతల్లో మార్పు రాలేదని తెలుస్తోంది.ఈ క్రమంలోనే దాదాపు యాభై మంది ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కని పరిస్థితి నెలకొంది.
మరోవైపు 11 నియోజకవర్గాల్లో కొత్త ఇంఛార్జులను నియమించారు వైఎస్ జగన్.రానున్న రెండు, మూడు రోజుల్లో మిగతా ప్రాంతాల్లోనూ కొత్త ముఖాలు కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.
తెలంగాణ అసెంబ్లీ ఫలితాల నేపథ్యంలో ఏపీలో అటువంటి పరిస్థితి రాకూడదని వైఎస్ఆర్ సీపీ భావిస్తోంది.ఇందులో భాగంగానే ప్రజా వ్యతిరేకత ఉన్న నేతలకు టికెట్స్ ఇచ్చేది లేదని తేల్చి చెబుతోంది.
ఈ క్రమంలోనే నియోజకవర్గాలకు కొత్త ఇంఛార్జులను నియమిస్తూ పార్టీ తన విధానాన్ని స్పష్టం చేసింది.ప్రజలకు దగ్గరగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే వారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వనుంది.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్లనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాల్లో విజయం సాధించాలని ఆచితూచి అడుగులు వేస్తుందన్నారు.
భవిష్యత్ లో కూడా పార్టీలో మార్పులు ఉండే అవకాశం ఉందని సజ్జల తెలిపారు.అలాగే నాలుగన్నరేళ్ల జగన్ పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమ పథకాలే తమను మరోసారి గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
మొత్తం మీద ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే వైఎస్ జగన్ జెట్ స్పీడులో ఎన్నికలకు సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది.అలాగే బీసీ వర్గాలకు అధిక ప్రాధాన్యం కల్పించడంతో పాటు వెనుకబడిన వర్గాలకు సైతం మరింత గుర్తింపు, ప్రాధాన్యత కల్పిస్తూ కొత్త ఇంఛార్జుల నియామకాలు సాగుతున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.175 నియోజకవర్గాల్లోనూ విజయాన్ని సాధించాలనే టార్గెట్ గా వైఎస్ఆర్ సీపీ అడుగులు వేస్తోంది.







