నల్లగొండ జిల్లా: కేటిఆర్ మిత్రుడు, ఎన్ఆర్ఐ,బీఆర్ఎస్ నేత గడ్డంపల్లి రవీందర్ రెడ్డి బుధవారం గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పారు.ఈ సందర్భంగా నాగార్జున సాగర్ లోని నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్ కాలనీ లోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు.
మంత్రి జగదీష్ రెడ్డిని ఉమ్మడి నల్గొండ జిల్లాలో అందరూ ఐదు లక్షల రెడ్డి అని అంటారని,ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 12 నియోజకవర్గాలలో మంత్రి జగదీష్ రెడ్డి గ్రూపు రాజకీయాలను ప్రోత్సహించుకుంటూ రాజకీయం నడిపించారని, నాగార్జునసాగర్ బీఆర్ఎస్ ఇంచార్జ్ గా ఉన్న నోముల నర్సింహయ్యను కూడా అనేక విధాలుగా ఇబ్బందులకు గురిచేశారని,నర్సింహయ్యకు తోడుండే ఉద్యమకారులను కూడా హింసించి విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేశారని మండిపడ్డారు.
నోముల నరసింహయ్య తోడుగా ఉద్యమకారుల ఆశయాలను భుజస్కంధాలపై వేసుకొని, గ్రూపు రాజకీయాలకు తావివ్వకుండా పార్టీ ఆదేశాలను పాటిస్తూ,ఉద్యమ భావాజాలంతో పార్టీని రక్షించుకోవాలని ఏకైకలక్ష్యంతో ముందుకెళ్లి 2018లో బీఆర్ఎస్ అభ్యర్ధి ఎమ్మెల్యే నోముల నరసింహయ్యను భారీ మెజార్టీతో గెలిపించుకోవడం జరిగిందన్నారు.
గెలిచిన తర్వాత నోముల కూడా అదే ధోరణిలో వ్యవహరించారని, మంత్రి జగదీష్ రెడ్డి అవసరం వుంటే కులాలను వాడుకుంటారని,అవసరం తీరిన వెంటనే కులాల మధ్య చిచ్చు పెడతారని నిప్పులు చెరిగారు.బీఆర్ఎస్ పార్టీని బ్రష్టు పట్టించిన దుర్మార్గుడు మంత్రి జగదీష్ రెడ్డి అని, ఉద్యమకారులను ఉమ్మడి నల్లగొండ జిల్లాలలో లేకుండా చేసిన ఘనత కూడా ఆయనకే దక్కిందని,
తొలి తెలంగాణ అమరవీరుడు శ్రీకాంత్ చారి తల్లి శంకరమ్మ తెలంగాణ తల్లి అని,అలాంటి తల్లిని నిరాధారణకు గురిచేసిన వ్యక్తి మంత్రి జగదీష్ రెడ్డి అని అన్నారు.
ఎంతో మందిని తన అనుచరులను కార్పొరేట్లుగా, ఎమ్మెల్సీ,తన మిత్రులకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పించగలిగారని,వార్డు మెంబర్గా కూడా గెలవని వాళ్లకు ఎమ్మెల్సీ కట్టబెట్టారన్నారు.కొత్తగా సిద్దించిన తెలంగాణకు అభివృద్ధి బాటలు వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించారని,అందులో మమేకమై మేము పనిచేశామన్నారు.
బీఆర్ఎస్ లో ఎదుగుతున్న నాయకులను అణచివేసే ధోరణిలో జగదీష్ రెడ్డి వ్యవహరించారని విరుచుకుపడ్డారు.ఈ కార్యక్రమంలో గాలి సైదిరెడ్డి, తన్నీరు సతీష్ రెడ్డి నర్సింహ, పోతునూరు సర్పంచ్ దుర్గమ్మ శ్రీనివాస్,ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు.