సైబర్ నేరగాళ్ల ( Cybercriminals )మోసాలకు అడ్డు అదుపు అనేది లేకుండా పోతోంది.ప్రజలను మోసం చేయడానికి అన్ని రకాల దారులను ఈ సైబర్ నేరగాళ్లు తెరచే ఉంచారు.
ఏకంగా కొందరైతే పోలీస్ శాఖను లక్ష్యంగా చేసుకుని భారీగా మోసం చేయాలని ప్రయత్నిస్తున్నారు.ఈ క్రమంలో పోలీసు శాఖను లక్ష్యంగా చేసుకుని విసిరిన సైబర్ వలను అనంతపురం పోలీసులు చాలా సులభంగా ఛేదించారు.
అందుకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.

అనంతపురం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.ఎస్పీ అన్బురాజన్ ( SP Anburajan )ఫోటో ప్రొఫైల్ గా ఉన్న వాట్సప్ నుంచి ఇటీవలే అనంతపురం నగరంలో( Anantapur ) ఉండే వన్ టౌన్, టూ టౌన్, రూరల్, ఇటుకల పల్లి పోలీస్ స్టేషన్ల సీఐ లకు ముందుగా చాటింగ్ చేసి, ఆ తర్వాత తాను అర్జెంట్ పని మీద ఉన్నానని, కొంత డబ్బు పంపించాలని ఆ వాట్సప్ నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది.అయితే వన్ టౌన్ సీఐ రెడ్డప్ప( One Town CI Reddappa ) కు ఆ వాట్సప్ నంబర్ ఎస్పీ ది కాదనే అనుమానం వచ్చింది.
వెంటనే సీఐ రెడ్డప్ప ఇచ్చిన ఫిర్యాదుతో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు.సైబర్ వలను ఛేదించాలని ఎస్పీ ఆదేశించారు.దీంతో ప్రత్యేక బృందం రంగంలోకి దిగి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించింది.

ఈ పోలీసు బృందం దర్యాప్తులో భాగంగా ఫేక్ కాల్, మెసేజ్ వచ్చిన ఫోన్ నెంబర్ తమిళనాడులోని కోయంబత్తూర్ ( Coimbatore in Tamil Nadu )కు చెందినదిగా గుర్తించారు.వన్ టౌన్ ఎస్ఐ వెంకటేశ్వర్లు ( One Town SI Venkateshwarlu )ఆధ్వర్యంలో పోలీస్ ప్రత్యేక బృందం కోయంబత్తూర్ కు వెళ్లి, సైబర్ నేరానికి ప్రయత్నించిన విజయలక్ష్మి అనే మహిళను అరెస్టు చేసి అనంతపురం తీసుకువచ్చారు.పోలీసుల విచారణలో కష్టపడకుండా చాలా సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ఇలా సైబర్ నేరాల వైపు పయనించినట్లు తెలిపింది.







