సూర్యాపేట జిల్లా: కుల అహంకారానికి బలైన సూర్యాపేట జిల్లా కేంద్రానికి గిరిజన బిడ్డ,యువ అడ్వకేట్ ధరావత్ నిఖిల్ నాయక్ హత్య చేయబడితే న్యాయం చెయ్యని మంత్రి జగదీష్ రెడ్డిని ఎన్నికల్లో ఓడిస్తామని లంబాడి విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు బాలూ నాయక్ అన్నారు.సోమవారం రాత్రి జిల్లా కేంద్రంలో తల్లి తెలంగాణ విగ్రహం వద్ద సంఘం అధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిఖిల్ నాయక్ హత్య కేసులో ఎస్పీ మరియు మంత్రి హంతకులతో కుమ్మక్కై కేసును కాలయాపన చేస్తూ పక్కదోవ పట్టించారని ఆరోపించారు.
అందుకే లంబాడ బిడ్డలమంతా ఏకమై మంత్రిని ఓడిస్తామన్నారు.
గిరిజన బిడ్డలు చనిపోతే స్పందించని మంత్రిని ఇంటికి పంపాల్సిన అవసరం ఉందన్నారు.నిఖిల్ నాయక్ ది సూసైడ్ కాదని,సుపారి హత్యని ఎన్నిసార్లు చెప్పినా మంత్రి పట్టించుకోలేదని, ఎన్నికల్లో మంత్రికి డిపాజిట్ లేకుండా ఓడించడమే మా ఎజెండా అని,ప్రతీ తండాల్లో తిరిగి మంత్రికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో నిఖిల్ తండ్రి భాస్కర్ నాయక్, సంఘం అధికార ప్రతినిధి విజయ నాయక్,జిల్లా అధ్యక్షుడు హరీష్ నాయక్ నియోజకవర్గ అధ్యక్షుడు నరసింహ నాయక్, వీరన్ననాయక్,రమేష్ నాయక్,జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.